14ఏళ్ల చంద్రబాబు పాలన నాలుగేళ్ల జగన్ పాలనపై దమ్ముంటే చర్చకు వస్తారా: మంత్రి సవాల్!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి మేరుగ నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు నిజాయితీ లేదన్నారు. పద్నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులు చేయకుండా, ఇప్పుడు మళ్లీ గెలిస్తే చేస్తానని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
600 హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేయడం కోసం మాయమాటలు చెబుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. కరోనా వస్తే తండ్రి కొడుకులు హైదరాబాదుకు పారిపోయారని, ఇప్పుడు ఎన్నికల కోసం రోడ్ల మీద తిరుగుతున్నారని టార్గెట్ చేశారు. పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన నాలుగేళ్ల జగన్ పాలనపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పేటెంట్ కార్యక్రమం ఒకటి కూడా లేదని విమర్శించారు. అవినీతి అక్రమాల నాయకుడిగా చంద్రబాబుకు పేటెంటు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 73 ఏళ్ల వయసులో హుందాగా మాట్లాడకుండా చంద్రబాబు బూతులు మాట్లాడుతున్నాడు అని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుల రాజకీయాలు చేసే మూర్ఖుడు అంటూ మండిపడ్డారు.
రాష్ట్రంలో పాలించే అధికారం తమకు నాలుగు నెలలు ఉందో, 40 ఏళ్లు ఉందో ప్రజలు తేలుస్తారని పేర్కొన్నారు. దొంగ రాజకీయాలు చేసే బాబును ప్రజలు ఆదరించరన్నారు. ఇక ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి మేరుగ నాగార్జున. గతంలో కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు తనను చంపేస్తాడు అని చెప్పాడని, ఇప్పుడు ఆయన పంచన చేరారని విమర్శించారు.

కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయ భిక్ష పెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్న ఆయన కన్నా లక్ష్మీనారాయణ బూతులతో బతికాడని, అవినీతి అక్రమాలతో డబ్బు సంపాదించాడని విమర్శించారు. 2024లో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడినుంచి పోటీ చేస్తాడో.. ఎలా గెలుస్తాడో చూస్తామని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications