రెడ్ బుక్ ను లోకేష్ పక్కనబెట్టేశారా ? రీజన్ ఏంటి ?
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం విపక్షంలో ఉన్న టీడీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, కేసులతో భయబ్రాంతుల్ని చేస్తున్న సమయంలో వారిలో స్థైర్యం నింపేందుకు అప్పట్లో నారా లోకేష్ రెడ్ బుక్ ను తెరపైకి తెచ్చారు. వైసీపీ హయాంలో టీడీపీని టార్గెట్ చేస్తున్న ప్రతీ నేత, అధికారి పేరును అందులో నమోదు చేసుకుంటున్నామని, వారికి తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని పదే పదే చెప్పేవారు. అలాగే అధికారంలోకి వచ్చాక కూడా రెడ్ బుక్ గురించి లోకేష్ పలుమార్లు ప్రస్తావించారు. అయితే కొంతకాలంగా లోకేష్ రెడ్ బుక్ ను ప్రస్తావించడమే మానేశారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ 1, 2, 3 అంటూ పలుమార్లు మంత్రిగా లోకేష్ దీని ప్రస్తావన చేశారు. గతంలో టీడీపీని ఇబ్బందిపెట్టిన పలువురు వైసీపీ నాయకులు, అధికారులపై చర్యలు తీసుకుంటున్న సందర్భంలో లోకేష్ రెడ్ బుక్ పేరు ప్రస్తావించేవారు. అయితే కొంతకాలంగా లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రస్తావించడమే మానేశారు. దీంతో లోకేష్ ఇలా రెడ్ బుక్ పక్కనపెట్టేయడం వెనుక రీజన్ ఏంటన్న చర్చ టీడీపీ క్యాడర్, నాయకుల్లో జరుగుతోంది.

మరోవైపు లోకేష్ గతంలో విపక్షంలో ఉండగా రెడ్ బుక్ ప్రస్తావన చేసినప్పుడల్లా వైసీపీ ఎగతాళి చేసేది. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక అదే వైసీపీ నేతల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టగానే జగన్ సహా ఇతర పార్టీ నేతలంతా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్న చర్చను పెద్ద ఎత్తున ప్రస్తావించడం మొదలుపెట్టారు. వైసీపీ నాయకులు ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా, మీడియాతో మాట్లాడినా రెడ్ బుక్ గురించిన చర్చ లేకుండా ఉండేది కాదు. కేంద్రానికీ దీనిపై ఫిర్యాదు చేశారు.

దీంతో అధికారంలో ఉన్న ప్రభుత్వం రెడ్ బుక్ అంటూ ప్రత్యేక రాజ్యాంగం అమలు చేస్తోందని, వైసీపీని టార్గెట్ చేసేందుకే ఇలా రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఎక్కువయ్యాయి. అదే సమయంలో వైసీపీలో జగన్ తప్ప కీలక నేతలపై ఏదో విధంగా కేసులు నమోదు చేశారు. వీరిలో కొందరిని జైళ్లకు కూడా పంపారు. దీంతో రెడ్ బుక్ ఆపరేషన్ విషయంలో టీడీపీ క్యాడర్ కూడా సంతృప్తిగానే కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు లోకేష్ కొంతకాలంగా రెడ్ బుక్ ను ప్రస్తావించడం ఆపేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications