బచ్చాగాడు, ప్యాకేజీ పార్టీ, ప్రజలను రెచ్చగొట్టి...: పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రుల నిప్పులు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, శంకర్ నారాయణ, వేణుగోపాల కృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న జనసేనాని.. ఇవాళ రాజమండ్రిలో శ్రమదానానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అప్పుడే పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలు గుర్తొస్తాయి..
శనివారం రాజమండ్రి చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాగా, ఈ వ్యవహారంపై స్పందించారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అసలు, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం ఆంధ్ర వచ్చినప్పుడే రాజకీయాలు గుర్తుకువస్తాయంటూ ఎద్దేవా చేశారు.. గతంలో బీజేపీని పాచిపోయిన లడ్డు అన్నాడని, మాయావతి కాళ్లు కూడా పట్టుకున్నాడని గుర్తుచేసిన మంత్రి... ఇప్పుడు 2024లో నేనే ముఖ్యమంత్రి అంటాడు అంటూ మండిపడ్డారు..

పవన్ కళ్యాణ్ ఓ బచ్చా అంటూ వెల్లంపల్లి..
చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక బచ్చాగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకం పవన్ అంటూ మండిపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. చంద్రబాబు 5 ఏళ్ల హయాంలో రోడ్ల రిపేర్లకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని... అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రోడ్లు ఎందుకు పూడ్చలేదని నిలదీశారు. ఇవాళ వచ్చి రెండు తట్టల మట్టి వేస్తే అయి పోతుందా ? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. కొండ ఎవరో ఎత్తు తుంటే చివరలో వేలు పెట్టి నేనే ఎత్తుతున్నాను అన్నట్లు ఉందని పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఏం నిరూపించాలనుకుంటున్నారో అర్ధం కావటం లేదని, కేవలం రిపేర్ల కోసం రెండు వేల రెండు వందల కోట్ల టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. వర్షాల్లో రోడ్లు బాగు చేసే పనులు చేపడితే మెంటల్ కేస్ అంటారని, నవంబర్ నుంచి పనులు ప్రారంభం అవుతాయని సజ్జల తెలిపారు.

పవన్ కళ్యాణ్ ది ప్యాకేజీ అంటూ మంత్రి శంకర్ నారాయణ..
రోడ్ల మరమ్మతుల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం సెటైర్లు వేశారు మరో మంత్రి శంకర్ నారాయణ.. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. పవన్‌ది ప్రశ్నించే పార్టీ కాదు.. ప్యాకేజీ తీసుకునే పార్టీ అని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారిపై మాట్లాడక పోవడం విడ్డూరం.. రాష్ట్ర రహదారులపై మాట్లాడటం ఏంటి? అని ప్రశ్నించారు. వర్షాలు ఆగిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపడతామన్న మంత్రి.... ఉనికి కోసం బూటకపు రోడ్డు శ్రమ దానాలు చేస్తున్నారని మండిడ్డారు. పవన్ కళ్యాణ్ ది ప్యాకేజీ కోసమే ఆరాటం తప్ప... ప్రజల కోసం కాదని విమర్శించారు మంత్రి శంకర్ నారాయణ. పవన్ పార్టీ పెట్టింది తన స్వలాభం కోసం.. తన విలాసవంతమైన జీవితం గడపడం కోసమేనంటూ ఆరోపించారు. రోడ్ల శ్రమదానం పేరుతో కొత్త వేషం వేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలంతా వైసీపీ వైపే ఉన్నారని గ్రహించాలన్నారు. కాగా, శనివారం రాజమండ్రితో పాటు అనంతపురం జిల్లాలోనూ పర్యటించనున్న పవన్ కళ్యాణ్.. అక్కడ రోడ్ల మరమ్మతుల కోసం శ్రమదానం కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే పవన్ కళ్యాణ్ ఆలోచన..
బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ శనివారం మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న కార్యక్రమం ప్రజలు హర్షించేది కాదన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో వర్షాలు కురవలేదన్న విషయాన్ని పవన్ ఆలోచించాలన్నారు. టీడీపీ పాలకులు వేసిన రోడ్లు ఇప్పుడు పడుతున్నవర్షాలకు ధ్వంసం అయ్యాయని తెలుసుకోవాలన్నారు.తనకున్న గ్లామర్‌ను ప్రజలకు ఉపయోగపడేలా చేయకుండా అశాంతిని సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. తాత్కాలికంగా ఒకసారి కనిపించి ప్రజలను రెచ్చ గొట్టి లబ్ధి పొందాలన్న ఆలోచనలో పవన్ ఉన్నాడని ఆరోపించారు. వర్షాలు తగ్గిన వెంటనే రూ.5,600 కోట్లతో రోడ్లు మరమత్తులు చేయాలన్న ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని వివరించారు.












Click it and Unblock the Notifications