హజ్ యాత్రికులకు ఏపీ సర్కార్ అప్ డేట్..! మంత్రి కీలక ప్రకటన..
ఏపీ నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి హజ్ యాత్రకు వెళ్లే వారి కోటాతో పాటు ఇతర ఏర్పాట్ల వివరాలను ఇవాళ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హజ్ -2025 యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుండి యాత్రికుల ప్రయాణాలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది ఏపీ నుంచి హజ్ యాత్ర ప్రయాణాలకు సంబంధించిన వివరాలను మంత్రి ఫరూక్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం 1630 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో 1170 మంది యాత్రికులు హైదరాబాద్ ఎంబార్కేషన్ నుండి బయలుదేరుతున్నారని తెలిపారు. వివిధ దశల్లో హజ్ యాత్ర ప్రయాణ ప్రణాళిక ఖరారు అయిందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలోమొత్తం 236 మంది ఈనెల 29వ తేదీ నుండి మే 11 తేదీ వరకు హైదరాబాద్ నుండి మదీనా మునవ్వరా కు బయలుదేరుతారని పేర్కొన్నారు.

రెండవ విడతలో 934 మంది మే 19 వ తేదీ నుండి 27 తేదీ వరకు హైదరాబాద్ నుండి జెడ్డాకు బయలుదేరనున్నట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు. అలాగే బెంగళూరు ఎంబార్కేషన్ నుండి 452 మంది హజ్ యాత్రికులు ఈ నెల 30 తేదీ నుండి మే 15 వ తేదీ వరకు బెంగళూరు నుండి మదీనా మునవ్వరాకు బయలుదేరుతారని తెలిపారు.
హైదరాబాద్ ఎంబార్కేషన్, బెంగళూరు ఎంబార్కేషన్ ల నుండి హజ్ యాత్ర కు బయలుదేరుతున్న ఏపీ హజ్ యాత్రికులకు వసతి సౌకర్యాలు కల్పించే విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యాత్రికులు తమ ఆరోగ్య రీత్యా హజ్ నిబంధనల మేరకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. హజ్ యాత్రకు బయలుదేరుతున్న వారందరికీ మైనారిటీ శాఖా మంత్రి ఫరూక్ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications