APలో KCRకు, BRSకు మొదటికే మోసం?
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారింది. దీంతో పది సంవత్సరాలుగా తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయం చేస్తూ లాభపడుతూ వచ్చిన కేసీఆర్ తాజాగా దాన్ని అటకెక్కించారు. జాతీయ విధానంతో, జాతీయ సమస్యల పరిష్కారం కోసం పార్టీ ముందుకు పయనిస్తుందని ప్రకటించారు. ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇబ్బంది లేదుకానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన ఎలా వ్యవహరించబోతున్నారు? అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

ఎవరితోను పొత్తు లేదు?
భారత రాష్ట్ర సమితి ఏపీలో ఎవరితోను పొత్తు పెట్టుకొనే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వంతో కేసీఆర్ స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో హైదరాబాద్ ను తీసుకోవడమే కాకుండా కేసీఆర్ తమను సీమాంధ్రులంటూ తరిమి తరిమి కొట్టారు అనే భానవలో ఏపీ ప్రజలున్నారు. ఇటువంటి తరుణంలో కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే సాహసాన్ని ఏ పార్టీ చేయడంలేదు. ప్రస్తుతానికి కేసీఆర్ కూడా తెలంగాణ తర్వాత మహారాష్ట్రలోనే పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

అన్నీ విశ్లేషించుకున్న కేసీఆర్
బీఆర్ఎస్ ను ఏపీలో ప్రజలు ఎలా స్వీకరిస్తారు? వారి మనోభావాలు ఎలా ఉంటాయి? ఏవిధమైన చర్యలు చేపట్టాలి? ఇత్యాధి విషయాలన్నింటినీ కేసీఆర్ ముందే విశ్లేషించారు. అందుకే ఆయన ముందుగా మహారాష్ట్రపై దృష్టి కేంద్రీకరించారంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులకే ప్రాధాన్యత అంటూ ప్రకటించింది. రాజధాని కోసం అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు భూములిచ్చారు. వారంతా మూడు సంవత్సరాల నుంచి అమరావతినే ఏకైకా రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమం చేస్తున్నారు.

అమరావతిపై బీఆర్ఎస్ స్పందన ఏది?
భారత రాష్ట్ర సమితి ఇంతవరకు అమరావతిపై తన అభిప్రాయం వెల్లడించలేదు. ఇటీవలే విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ రావును ఈ విషయమై ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. దీనిపై స్పందించడానికి ఇంకా సమయం ఉందన్నారు. అలాగే పోలవరం పై బీఆర్ ఎస్ స్పందన ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కాని కేంద్రం ఇంతవరకు ఇవ్వలేదు. దీనిపై ఆ పార్టీ స్పందన తెలియరాలేదు. ప్రధానమైన సమస్యలను పరిష్కరించిన తర్వాతే ఇతర అంశాల జోలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కాకుండా కేవలం ఏపీ ప్రజలకు కులానికి ప్రాధాన్యత ఇస్తారని కుల రాజకీయాలు చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications