ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!
ఏపీలో ఆస్తిపన్ను (property tax) చెల్లింపుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారికి ఊరట కల్పించేలా పురపాలక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించిన వారికి ఊరట కల్పించేలా ఈ నిర్ణయం ఉంది. కాబట్టి మార్చి 31లోగా తమ ఆస్తిపన్ను బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ప్రజల్ని కోరుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు, వాటిపై వడ్డీలతో సహా భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఆస్తిపన్ను బకాయిలు ఉన్న వారు వాటిపై ఇప్పటికే విధించిన వడ్డీలో 50 శాతం రాయితీతో బిల్లుల చెల్లింపు చేసేందుకు మున్సిపల్ శాఖ అనుమతించింది. మున్సిపాలిటీల్లో ఉన్న ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఇది వర్తించనుంది.

ఈ నెల 31 లోగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో 50 శాతం రాయితీ ఇస్తూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ జీవో నెంబర్ 58 విడుదల చేశారు. మరోవైపు ఇప్పటికే ఆస్తిపన్ను చెల్లించిన వారికి సైతం ప్రభుత్వం ఊరట ఇచ్చింది. ఇప్పటికే వడ్డీతో ఆస్తిపన్ను చెల్లించిన వారికి తదుపరి బిల్లులో మినహాయింపు ఇస్తామని జీవో లో ప్రభుత్వం పేర్కొంది. కాబట్టి ఆస్తిపన్నుపై వడ్డీ విధించిన ప్రతీ ఒక్కరికీ ఏదో విధంగా ఊరట దక్కబోతోందన్న మాట. రాష్ట్రంలో పన్నుల ఆఆదాయం పెంచుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications