ఏపీకి కేంద్రం పర్యాటకంగా బిగ్ బూస్ట్ – ఏపీలో సీ ప్లేన్ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త రెక్కలు వచ్చాయి. కేంద్రం ఏపీకి అడుగడుగునా ఇస్తున్న సపోర్ట్ తో ఏపీలో పర్యాటక అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. తాజాగా ఏపీకి కేంద్ర పౌర విమానయాన శాఖ సీ ప్లేన్ సేవలకు అధికారిక అనుమతి ఇచ్చింది. నీటిపైనే టేకాఫ్, ల్యాండింగ్ చేసే ఈ విమానాలు రాష్ట్రంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలను వేగంగా అనుసంధానించనున్నాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీలో ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడు ఏపీలో ఏవియేషన్ రంగ ప్రగతికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సీ ప్లేన్ సర్వీసులకు అధికారిక అనుమతులు త్వరితగతిన ఇప్పించి జల విమానాలకు మార్గం సుగమం చేశారు.

ఏపీలో పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేలా పర్యాటక శాఖ నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా తొలి దశలో విజయవాడలోని బెర్మ్ పార్క్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఘాట్ రోడ్డు మార్గంలో గంటల తరబడి సాగే ప్రయాణానికి బదులు ఈ జల విమానాల ద్వారా చాలా త్వరగా చేరుకోవచ్చు. ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం కావడంతో త్వరలోనే రెగ్యులర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రెగ్యులర్ సేవలకు మౌలిక సదుపాయాలు వేగంగా ఏర్పాటు చేస్తున్నారు.వాటర్‌డ్రోమ్‌ల నిర్మాణానికి కీలక ప్రాంతాలను ఎంపిక చేశారు. విజయవాడ, శ్రీశైలంతో పాటు విశాఖపట్నం, లంబసింగి, కాకినాడ, సూర్యలంక వంటి చోట్ల ఈ సదుపాయాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో జెట్టీలు, ప్యాసింజర్ లాంజ్‌లు, భద్రతా వ్యవస్థలు అభివృద్ధి చేయనున్నారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే సమయం, శ్రమ భారీగా ఆదా అవుతాయి.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర ప్రాంతీయ విమానయాన పథకం మద్దతుతో ధరలు కూడా తక్కువగా ఉండేలా చూస్తున్నారు. ఈ సౌకర్యాలు ఏర్పరిస్తే, అంతర్జాతీయ వసతులు కల్పిస్తే దేశ, విదేశీ పర్యాటకుల రాక పెరిగి హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మంచి ఊతం లభిస్తుంది. జల విమానాలు ఏపీ పర్యాటకానికి కొత్త రెక్కలు ఇవ్వటమే కాదు రాష్ట్ర పర్యాటక రంగానికి బూస్ట్ ఇస్తాయి.














Click it and Unblock the Notifications
