ప్రధాని మోడీ-చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో కొత్త గేమ్: అందుకే వైసీపీకి భయం
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన, ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతోన్నాయని చెప్పారు. అందుకే వైఎస్ఆర్సీపీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
వైఎస్ఆర్సీపీకి కౌంట్‌డౌన్ మొదలైందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. త్వరలో తాడేపల్లి ప్యాలెస్‌కు టులెట్ బోర్డు పడబోతోందని ఆరోపించారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా తమపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని గుర్తు చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరు కావాలంటూ చంద్రబాబును కేంద్రం ఆహ్వానించిందని పేర్కొన్నారు.

దీన్ని చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని చురకలు అంటించారు. కేసుల మాఫీ కోసం చంద్రబాబు ప్రధానిని కలవలేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆ అవసరం తమకు లేదని ఆయన వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రాజకీయాల కోసం వాడుకోవడం వైఎస్ఆర్సీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బ్రిటిష్ పాలకులకు వారసుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నాయకులను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు.
మూడు సంవత్సరాలుగా దోచుకోవడం, దాచుకోవడంలో మాత్రమే సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారని ఆరోపించారు. రాజ్యాంగేతరశక్తిగా మారారని ధ్వజమెత్తారు. మంత్రులను డమ్మీలుగా మార్చారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులపై ఇప్పటికే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, వారి పతనం మొదలైందని అన్నారు. సమస్యలను పరిష్కారం ఎదురుదాడికి దిగుతున్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications