ఏపీ తెలంగాణా విద్యుత్ బకాయిల రగడ : తెలంగాణా బకాయిల కోసం కోర్టు మెట్లెక్కిన ఏపీ ; ఎవరివాదన వారిదే !!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒక్క వాటర్ వార్ మాత్రమే కాదు విభజన పంచాయితీలు చాలానే ఉన్నాయి. ఆర్టీసీ ఆస్తుల విషయంలో, తెలుగు అకాడమీ ఆస్తుల విషయంలో, అనేక శాఖలకు సంబంధించి తెలంగాణలో ఉండిపోయిన ఆస్తుల విషయంలో ఏపీకి రావాల్సిన వాటాలపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణా ప్రభుత్వం మా రాష్ట్రంలో ఉన్నవి మావే అని వాదన వినిపిస్తుంటే, ఏపీ ప్రభుత్వం విభజన చేసిన సమయంలో కేంద్రం పంపకాలు చేసిన తమ వాటాలు తమకు కావాలని తెలంగాణా సర్కార్ ను అడుగుతుంది. కానీ తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోకపోవటం, విభజన నాటి ప్రభుత్వం కేంద్రంలో లేకపోవటంతో ఏపీకి ఈ సమస్యలను పరిష్కరించటం పెద్ద తలనొప్పిగా తయారైంది.

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల రగడ .. కోర్టు మెట్లెక్కిన ఏపీ
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరాకు సంబంధించి అనేక పంచాయితీలు విభజన జరిగిన నాటి నుండి నేటి వరకు తేలకుండా ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు రావాలని తక్షణం ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో తెలంగాణ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3,441 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవలసి ఉందని, 2017 జూన్ నాటికి 2841 కోట్ల వడ్డీ కూడా చెల్లించాల్సి ఉందని తమ పిటిషన్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏపీకి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించలేదని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది.

ఏపీ విద్యుత్ సంస్థల రుణ భారం పెరిగిపోయింది.. తెలంగాణాతో బకాయిలు ఇప్పించండి
డబ్బుల చెల్లింపు కోసం అడిగి అడిగీ చివరకు విద్యుత్ సరఫరా నిలిపివేశామని వెల్లడించింది . ఇప్పటివరకు మొత్తంగా తమకు రావాల్సిన 6283 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థల పై రుణ భారం బాగా పెరిగిపోయిందని, అప్పులు చేయడం కూడా సాధ్యం కావడం లేదని , బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ బకాయిలు చెల్లించకపోతే తాము తీవ్రంగా ఇబ్బంది పడతామని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లిన ఏపీ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ తమకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించేలా చూడాలని పిటిషన్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఏపీనే తమకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్న తెలంగాణా జెన్ కో
ఇదిలా ఉంటే ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమకు డబ్బులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న పరిస్థితి ఉంది. ఏపీ నుంచి తమకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని తెలంగాణ ట్రాన్స్ కో , జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు చెప్తున్నారు. అన్ని లెక్కలు చూసుకుందామని చాలాసార్లు ఏపీ విద్యుత్ సంస్థలకు లేఖలు రాశామని, అయినా వారు లెక్కలు చూడడం కోసం రావడంలేదని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. డిస్కంల నుంచి బకాయిలు రావాల్సి ఉంటే వాటి నుంచి వసూలు చేసుకోవాలి కానీ జెన్కోకు చెల్లించాల్సిన డబ్బులను నిలిపివేయడం సరికాదని తెలంగాణ వాదిస్తోంది.

మూడేళ్ళుగా నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లా లో ఏపీ తెలంగాణా బకాయిల వివాదం, కేసు విత్ డ్రా చేసుకున్న ఏపీ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య చోటుచేసుకున్న ఈ వివాదం మూడేళ్లుగా జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ లా లో విచారణ జరుగుతోంది. అయితే ప్రభుత్వరంగ సంస్థలు దివాలా ప్రక్రియ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గత ప్రభుత్వం నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లా లో వేసిన కేసును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అప్పుడు నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. రెండున్నరేళ్ల పాటు ఒక్క రూపాయి చెల్లించమని అడగని ఏపీ సర్కార్ కు ఇప్పుడు, తెలంగాణ సర్కార్ బకాయిలు విద్యుత్తు రంగ సంస్థలు నడవడానికి అవసరంగా మారాయి. అయితే ఇప్పుడు నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లాలో కేసును ఉపసంహరించుకోవడం హైకోర్టులో కేసు వేయడానికే అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

తమ బకాయిలు చెల్లించేలా తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి .. ఏపీ విజ్ఞప్తి
అదనంగా కరెంటు తీసుకొని ఒక్క రూపాయి కూడా ఇవ్వని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, రావలసిన బకాయిలు వసూలు చేసుకునేందుకు కోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్ ఇతర సంస్థలకు ఇవ్వాల్సిన బిల్లులను చెల్లించడానికి, బొగ్గు సరఫరాకు తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని, వడ్డీతో సహా తమ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఏపీ సర్కార్ కోర్టుకు విజ్ఞప్తి చేస్తోంది. అంతే కాదు ముందుగా తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిన 3441 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరింది.
Recommended Video

తెలంగాణా ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చెయ్యాలని ఆదేశం .. అక్టోబర్ 28న మళ్ళీ విచారణ
ఇక ఏపీ జెన్కో హైకోర్టులో వేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, విద్యుత్ సమన్వయ కమిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణ అక్టోబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అనేక విభజన పంచాయితీలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడైనా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న ఈ వివాదాలు పరిష్కారం అవుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications