చంద్రబాబు, ఉమకు మహిళా కమిషన్ హెచ్చరికలు-హాజరుకాకుంటే చర్యలు-ఏం జరగబోతోంది?
ఏపీలో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ మానసిక వికలాంగురాలిపై 30 గంటల పాటు సామూహిక అత్యాచారం జరిగిన ఘటన టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోతోంది. ఈ ఘటన తర్వాత బాధితురాలి పరామర్శకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ తనను అవమానించారంటూ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వారిద్దరికీ నోటీసులు పంపారు. ఇవాళ విచారణకు రావాలని ఆదేశించారు. అయితే వారిద్దరూ వెళ్లేలా కనిపించట్లేదు.

మహిళా కమిషన్ సమన్లు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా వెళ్లిన సమయంలోనే మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి వద్మ కూడా వెళ్లారు. నగరం నడిబొడ్డుిన గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నా మహిళా కమిషన్ ఏం చేస్తోందంటూ బోండా ఉమ వాసిరెడ్డి పద్మను ప్రశ్నించడంతో అక్కడ ఆమె ఇబ్బందికరమైన పరిస్ధితిని ఎదుర్కొన్నారు. దీంతో చంద్రబాబు, బోండా ఉమ తనను దూషించారంటూ, దీనిపై విచారణకు రావాలంటూ సమన్లు పంపారు. ఇవాళ విచారణ జరగాల్సి ఉంది.

వెళ్లబోమంటున్న చంద్రబాబు, బోండా
మహిళా కమిషన్ ఇవాళ చేపట్టే విచారణకు తాము హాజరు కాకూడదని చంద్రబాబుతో పాటు బోండా ఉమ కూడా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో చంద్రబాబు ఇదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.
అదే కోవలో బోండా ఉమ కూడా బహిరంగంగానే మహిళా కమిషన్ విచారణకు హాజరు కాబోమని స్పష్టం చేశారు. అసలు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు అవమానం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తమకు నేరుగా నోటీసులు పంపడమేంటని ఆయన మండిపడుతున్నారు.

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలు
మహిళా కమిషన్ తమకు సమన్లు పంపడాన్ని నిరసిస్తూ టీడీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. విజయవాడలో గ్యాంగ్ రేప్ బాధితురాలికి న్యాయం చేయమని కోరినందుకు నోటీసులు ఇస్తారా అంటూ నిరసనలకు దిగుతోంది. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, మహిళా కమిషన్ తమను టార్గెట్ చేయడంపై టీడీపీ మండిపడుతోంది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన అఘాయిత్యాలపై నిరసనలు చేపడుతోంది.

మహిళా కమిషన్ హెచ్చరికలు
చంద్రబాబు, బోండా ఉమకు మహిళా కమిషన్ జారీ చేసిన సమన్లను సభ్యులు సమర్ధించుకుంటున్నారు. మహిళా కమిషన్ కు సమన్లు జారీ చేసే అధికారం ఉందని చెప్తున్నారు. కమిషన్ సమన్లకు స్పందించి విచారణకు హాజరు కావాల్సిన బాధ్యత చంద్రబాబు, బోండా ఉమకు ఉందంటున్నారు. విచారణకు హాజరుకాకపోతే చట్టబద్ధంగా చర్యలు తప్పవని మహిళా కమిషన్ సభ్యురాలు శైలజ హెచ్చరించారు. దీంతో ఇవాళ చంద్రబాబు, బోండా గైర్హాజరైతే మహిళా కమిషన్ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మహిళా కమిషన్ చర్యలకు దిగితే మాత్రం కోర్టును ఆశ్రయించి అడ్డుకునేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications