AP Weather : ఏపీలో మరో మూడు రోజుల పాటు వడగాల్పులే..!
ఏపీలో వడగాల్పులు తీవ్రంగా సాగుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అకాల వర్షాలతో అప్పుడప్పుడూ కాస్త జనం ఊరట పొందుతున్నా తిరిగి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వడగాల్పులతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. అలాగే రేపటి నుంచి మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఇదే తరహాలో వడగాల్పులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు కోనసీమ జిల్లాలోని పామర్రు మండలంలో తీవ్రవడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. అలాగే 286 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఎల్లుండి 17 మండలాల్లో తీవ్రవడగాల్పులు ఉంటాయని హెచ్చరించింది. అలాగే మరో 300 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

ఇవాళ పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.1°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అలాగే మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో జనం ఉక్కపోత, వేడికి అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు నైరుతి రుతుపవనాలు ఈ నెల 8వ తేదీ నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 4 నాటికి కేరళ రాష్ట్ర తీరాన్ని తాకి 12 వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించే వీలుందన్నారు. అప్పటివరకూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications