ఏపీలో మారిన వాతావరణం
Rains in AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తోన్నాయి. పలు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఫర్వాలేదనిపించాయి. ఇదే పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉత్తరాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిస్తాయి.
పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఆ సమయంలో చెట్ల కింద తలదాచుకోకూడదని సూచించారు. పొలాల్లో పని చేసే రైతులు, రైతు కూలీలు ముందుజాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు.












Click it and Unblock the Notifications