ఇక వారీకీ ఉచిత బస్సు-అసెంబ్లీలో మంత్రి ప్రకటన-తాజా స్టేటస్ ఇదే..!
ఏపీలో ఉచిత బస్సు పథకంలో మరో మార్పు చోటు చేసుకుంది. ఇప్పటివరకూ మహిళలు, ట్రాన్స్ జెండర్లకు పరిమితమైన ఈ పథకాన్ని ఇకపై మరో వర్గానికి కూడా అమలు చేయాలని నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీంతో పాటు అసలు ఆర్టీసీ (APSRTC) ఉచిత బస్సులో ప్రయాణాల పరిస్దితి ఎలా ఉందో కూడా వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో సిటి ఆర్డినరీ, సిటి ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు సహా ఐదు రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్లు మంత్రి మండిపల్లి తెలిపారు. నేటి వరకు 47 కోట్ల ప్రయాణాలు జరగగా, రూ.1660 కోట్ల సబ్సిడీ ప్రభుత్వం భరించిందన్నారు. ఈ పథకం అమలుతో మహిళా ప్రయాణికుల శాతం 40% నుంచి 65%కు పెరిగిందని, రోజుకు సగటున 25 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని వెల్లడించారు.

అలాగే ఇకపై ఉచిత బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ సౌకర్యం వర్తింపచేయబోతున్నారు. అలాగే ఉచిత బస్సు పథకం కారణంగా ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు గతేడాది రూ.436 కోట్లు సాయం చేసినట్లు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం 75% ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని స్పష్టం చేశారు. పీఎం ఈ-బస్ సేవ ద్వారా 750 కొత్త బస్సులు రాష్ట్రానికి రానున్నాయని, సీఎన్‌జి, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని మంత్రి తెలిపారు.












Click it and Unblock the Notifications