ఏపీలో దాడులు జరగని రోజు, విధ్వంసం లేని ప్రాంతం ఉందా ? రాజారెడ్డి కత్తుల రాజ్యాంగం అమల్లో : అచ్చెన్న ధ్వజం
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీలో వరుసగా టిడిపి నేతలపై జరుగుతున్న దాడులపై నిప్పులు చెరిగారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు అకృత్యాలకు దారుణాలకు చిరునామాగా మారుస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో టిడిపి నేతపై వైసీపీ నేతలు మారణహోమం సృష్టించారు అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
Recommended Video

టిడిపి నేత మునెప్ప పై వైసిపి నేతలు కత్తులతో దాడి చేశారని అచ్చెన్న ఫైర్
చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం ఆర్.నడింపల్లి లో టిడిపి నేత మునెప్ప పై వైసిపి నేతలు కత్తులతో దాడి చేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మునెప్ప భూమి కబ్జా చేయడంతో పాటుగా అడ్డుకునేందుకు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని అచ్చెన్న ఆరోపించారు. మునెప్పకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

వైసీపీ దుర్మార్గాలకు చిరునామాగా ఏపీ
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు అచ్చెన్నాయుడు.ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన అచ్చెన్నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు, అకృత్యాలు దౌర్జన్యాలు ,దుర్మార్గాలు రాజ్యమేలుతున్నాయి అని విమర్శించారు. ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దుర్మార్గాలకు చిరునామాగా మారిందని విమర్శించారు. దాడులు జరగని రోజు, విధ్వంసం చోటు చేసుకొని ప్రాంతం రాష్ట్రంలో లేదన్నట్లుగా ఏపీ తయారైందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు
అధికారం అండగా ఉందని రాష్ట్రంలో రాజారెడ్డి కత్తుల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అడ్డుకున్న వారిని హతమార్చేందుకు తెగబడుతున్నారు అని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఇదే సమయంలో పేదల ఆస్తులను ఆక్రమించి దాడులతో మారణహోమం సృష్టించేందుకే ఒక్క అవకాశం అడిగారా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అచ్చెన్న విమర్శించారు.

రాష్ట్రాన్ని రావణకాష్టంలా జగన్ నిత్యం మండిస్తూనే ఉన్నారు
వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రాన్ని రావణకాష్టంలా జగన్ నిత్యం మండిస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజలు స్వేచ్ఛగా బ్రతక లేక పోతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. నిత్యం ఏపీలో ఎక్కడో ఒక చోట టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు .












Click it and Unblock the Notifications