ఎటిఎం సెంటర్ల వద్ద కాపు కాసి సాయం చేస్తున్నట్లు నటించి చోరీలు
కర్నూలు: ఓ అంతర్రాష్ట్ర ఎటిఎం దొంగను కర్నూలు జిల్లా గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. ఏడాది కాలంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అతను ఎటిఎంల వద్ద అమాయకులను మోసం చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన వివరాలను సిఐ మధుసూదన్ గౌడ్ మీడియా ప్రతినిధులకు వివరించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సిద్ధేశ్ చదువు మానేసి, ఏడాది కాలంగా చిల్లరగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి ఎటిఎంలపై కన్ను పడింది. ఎటిఎంల వద్ద కాపు కాసి, నిరక్షరాస్యులు డబ్బు డ్రా చేసుకోవడానికి వచ్చి ఇబ్బందులు పడుతుంటే వారికి సహాయం చేస్తున్నట్లు నటించి డబ్బులు డ్రా చేసుకునేవాడు.
కస్టమర్ల ఎటిఎం కార్డు తీసుకుని డబ్బు డ్రా చేస్తానని నమ్మబలుకుతాడు. బ్యాలెన్స్ చూసి సీక్రెట్ నెంబర్ గుర్తు పెట్టుకుంటాడు. వెంటనే కస్టమర్ ఎటిఎం కార్డును తెలివిగా జేబులో వేసుకుని డూప్లికేట్ కార్డును వారికి ఇచ్చేవాడు. వారు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఎటిఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకునేవాడు.

కర్నూలు నగరంలోని నాలుగు, గుత్తిలో రెండు, గుంతకల్లులో ఒక ఎటిఎంలో అతను డబ్బులు డ్రా చేసుకుంటూ జల్సాలు చేశాడు. గత నెలలో గుత్తి ఎసిబిఐ ఎటిఎంలో ఎస్‌ఎస్ పల్లికి చెందిన సుమంగళమ్మ, బసినేపల్లి తండాకు చెందిన తిరుపాల్ నాయక్, గుంతకల్లుకు చెందిన కుమార్ అనే కస్టమర్ల ఎటిఎంలు కాజేసి రూ.60 వేలు డ్రా చేసుకున్నాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఎటిఎం దొంగ జాడ కోసం పోలీసులు వారం రోజులుగా ఎటిఎం కేంద్రాల వద్ద నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుత్తి పట్టణంలోని ఎస్‌బిఐ ఎటిఎం కేంద్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సిద్దేశ్ అనే యువకుడిని పట్టుకుని పోలీసులు విచారించారు. దీంతో అతని బండారం బయటపడింది. అతని నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications