డంపింగ్ యార్డులో బిటెక్ విద్యార్థి మృతదేహం
అనంతపురం: రైలు ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం చెత్త పడేసిన డంపింగ్ యార్డులో ప్రత్యక్షం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో గురువారం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు.
అనంతపురం జిల్లా బెళుగుప్పకు చెందిన నాగిరెడ్డి కుమారుడు శ్రీనివాసులు గుత్తి పట్టణ శివారులోని ఎస్కేడి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్(ఈఈఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాల ముగిసిన అనంతరం కడపలో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని రైల్వేస్టేషన్‌కు బయల్దేరినట్లు తోటి విద్యార్థులు అరుణ్, లోకేష్ తెలిపారు. క
డపకు వెళ్తున్న రైలులో నుంచి శ్రీనివాసులు ప్రమాదవశాత్తు కిందపడి రెండు కాళ్లు తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో శవానికి పోస్టుమార్టం నిర్వహించి అనాథ శవంగా నిర్ధారించి ఖననం చేయాలని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు.

మున్సిపాలిటీ సిబ్బంది శవాన్ని ఖననం చేయకుండా పట్టణ శివారులోని మున్సిపల్ చెత్త డంపింగ్ యార్డులో పడవేశారు. గురువారం చెత్త డంపింగ్ యార్డులో మృతదేహం ఉన్నట్లు తెలుసుకున్న కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్కేడి విద్యార్థులు వెళ్లి చూడగా అది శ్రీనివాసులుది అని నిర్ధారించుకున్నారు. విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో డంపింగ్ యార్డు వద్దకు చేరుకుని శ్రీనివాసులు మృతదేహాన్ని చూసి చలించిపోయారు.
విద్యార్థులు గాంధీచౌక్ చేరుకుని గంటన్నర పాటు రాస్తారోకో నిర్వహించారు. శ్రీనివాసులు మృతిపై న్యాయ విచారణ జరిపించాలని, మృతదేహాన్ని ఖననం చేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన జీఆర్పీ, మున్సిపల్ సిబ్బందిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications