టిడిపికి బాబుమోహన్ గుడ్‌బై, బాబు తీరుపై కంటతడి

టిడిపికి రాజీనామా చేసిన బాబు మోహన్ మాట్లాడుతూ... తాను స్వర్గీయ నందమూరి తారక రామారావు, ప్రస్తుత పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుల పైన అభిమానంతోనే టిడిపిలో ఉన్నానని చెప్పారు. తన ఆస్తులను అమ్ముకొని పార్టీకి ఎంతో సేవ చేశానని చెప్పారు. ఎన్టీఆర్ పైన అభిమానంతో నాడు టిడిపిలో చేరానని చెప్పారు.
కానీ, అపనమ్మకంతో తన పైన ఎంక్వయిరీ వేయడం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోల్‌లో తన గెలుపుపై బాబు సర్వే చేయించడం బాధించిందన్నారు. కొందరు గ్రూపు రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తాను కార్యకర్తలతో మాట్లాడిన అనంతరం ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తాను చేరబోయే పార్టీపై త్వరలో నిర్ణయం తీసుకొని వెల్లడిస్తానని అన్నారు.
టిడిపిలోకి జెసి
అనంతపురం జిల్లా మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డిలు ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వారు సైకిల్ ఎక్కనున్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు కనుమరుగు కాదు: డిఎస్
ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీతో భేటీ అనంతరం డి శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో కాంగ్రెస్ ఎన్నటికీ కనుమరుగు కాదని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. గతంతో పోలిస్తే ఈ పర్యాయం బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications