ఏపిలో ఎందుకు పర్యటించరు: సుమన్, రాహుల్ పర్యటనలో మార్పులు
హైదరాబాద్: రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో భరోసా యాత్ర చేపడుతున్నారని టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ తెలంగాణ భరోసా యాత్రపై బాల్క సుమన్ పలు అనుమానాలను వ్యక్తం చేశారు.
రాహుల్ యాత్ర తెలంగాణకు మాత్రమే పరిమితం కావడానికి కారణమేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏపీలో రాహుల్ ఎందుకు పర్యటించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో అవసరం లేకున్నా వేలాది ఎకరాలు రైతుల నుంచి చంద్రబాబు లాక్కుంటున్నా.. రాహుల్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.
రాహుల్ శైలిని చూస్తుంటే తెలుగుదేశం-కాంగ్రెస్‌లు కుమ్మక్కైనట్లు కనబడుతోందని అన్నారు. అసలు ఆందోళన చేసిన రైతులను కాల్చిచంపిన చరిత్ర కాంగ్రెస్‌దేనని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం అమేథీలో వడగళ్ల వర్షం వల్ల రైతులు నష్టపోతే రాహుల్ అక్కడ పర్యటించలేదని బాల్క సుమన్ అన్నారు.

రాహుల్ పర్యటనలో మార్పులు
తెలంగాణలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్ వెళ్లి అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌కు రాహుల్ వెళ్లనున్నట్లు ఏఐసీసీ వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. రాత్రికి నిర్మల్‌లోని మయూరా ఇన్ హోటల్‌లో బస చేయనున్నారు.
ముందుగా నిర్ణయించిన విధంగానే శుక్రవారం కొర్టికల్ గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. రాహుల్ పర్యటన మార్గంలో రాహుల్ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిర్మల్‌లో రాహుల్ బస చేయనున్న హోటల్ ఎస్పీజీ అధీనంలోకి వెళ్లింది. హోటల్ పరిసరాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
బిజీ షెడ్యూల్ నేపథ్యంలో రాహుల్ పర్యటనలో మార్పులు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ ప్రధానంగా రైతు భరోసా యాత్ర నేపథ్యంలో రోడ్డు మార్గాన రెండు మూడు జిల్లాల్లో పర్యటించడం ద్వారా రాజకీయ యాత్రగా తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయనే కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సెషన్ల కారణంగా ఇప్పటికే రాహులు పర్యటనలో రెండు సార్లు మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా, ఢిల్లీలో అత్యవసర భేటీ వల్లే రాహుల్ పర్యటనలో మార్పులు జరిగాయని కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీలు ప్రకటించారు. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి సా.6.30కి ప్రత్యేక విమానంలో నాందేడ్‌కు చేరుకుంటారని వారు తెలిపారు. రాహుల్ నెల రోజుల తర్వాత హైదరాబాద్ పర్యటనకు వస్తారని వారు వెల్లడించారు












Click it and Unblock the Notifications