ఏపీలో భీమ్లా నాయక్ సినిమా కష్టాలు: మైలవరం,ఇంకొల్లులో థియేటర్ల మూసివేత; నిరాశలో పవన్ ఫ్యాన్స్
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ సినిమా మేనియా కొనసాగుతుంది. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాను చూడాలని అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సినిమా చూడడం కోసం ఫాన్స్ ఉత్సాహంతో థియేటర్లకు వెళ్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మిగిలిన అన్ని చోట్ల భీమ్లా నాయక్ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం భీమ్లా నాయక్ సినిమాకు ఇబ్బందులు తప్పడం లేదు.
Recommended Video

భీమ్లా నాయక్ సినిమాను టార్గెట్ చేసిన జగన్ సర్కార్
ఇదే సమయంలో భీమ్లా నాయక్ సినిమా ను టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్లను విక్రయించడానికి రద్దు చేసిన జీవో 35 ని అమలు చేయాలని అధికారులు థియేటర్ యాజమాన్యాలపై ఒత్తిడి చేస్తున్నారు. బ్లాక్ లో టిక్కెట్లు విక్రయించినట్లు తేలితే థియేటర్లను కూడా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిక్కెట్ల రేట్లు సమస్య ఇంకా ఒక కొలిక్కి రాకముందే, భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కావడంతో సినిమా టికెట్లు విక్రయాల విషయంలో థియేటర్ల యాజమాన్యాలు ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి.

పాత జీవో ప్రకారం టికెట్లు అమ్మాలంటే గిట్టుబాటు కాదంటున్న థియేటర్ యజమానులు
పాత జీవో ప్రకారమే టికెట్లు అమ్మాలంటే తమకు గిట్టుబాటు కాదని లబోదిబోమంటున్నారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో కొత్త జీవో మార్చి తొలి వారంలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కావడంతో థియేటర్ల యాజమాన్యాలు అధికారుల ఒత్తిడి మేరకు లబోదిబోమంటున్నారు. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలు వేయడానికి అవకాశం లేదని, ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘించి బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తే సినిమాటోగ్రఫీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని రెవిన్యూ అధికారులు స్పష్టం చేయడంతో థియేటర్ యజమానులు సినిమాను నడపలేమని అంటున్నారు.

పాత జీవో ప్రకారం టికెట్లు అమ్ముకోనివ్వాలని తెలుగు ఫిలిం చాంబర్ విజ్ఞప్తి
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల పై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై తెలుగు ఫిలిం ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రద్దు చేసిన జీవోను ఏవిధంగా అమలు చేయాలని థియేటర్లపై ఒత్తిడి తెస్తారు అంటూ ప్రశ్నించింది. ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారని మండిపడింది. జీవో 35 కి బదులు అంతకుముందున్న జీవో 100 ప్రకారమే టికెట్లు అమ్ముకునేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

మైలవరంలో నిలిచిపోయిన భీమ్లా నాయక్ సినిమా .. ఇంకొల్లులోనూ థియేటర్ క్లోజ్
దీంతో కృష్ణా జిల్లా మైలవరం లో భీమ్లా నాయక్ ప్రదర్శించే థియేటర్లు తాత్కాలికంగా మూసివేశారు. తగ్గించిన సినిమా టికెట్ ధరలతో భీమ్లా నాయక్ సినిమా తమకు గిట్టుబాటు కాదని, అందుకే సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నట్లుగా థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు గేటు బయట నోటీస్ అతికించడంతో సినిమా కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కావాలనే జగన్ సర్కార్ భీమ్లా నాయక్ సినిమాకు ఇబ్బంది కలిగిస్తుందని పవన్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా ఇంకొల్లులోనూ భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శన నిలిపి వేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications