భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పై శుభవార్త.. ప్రారంభం అప్పుడే
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం దగ్గర భోగాపురం వద్ద నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి నిర్మాణం చేయబడుతుంది. అంతర్జాతీయ విమాన సౌకర్యాలు కల్పించడానికి, కార్గో హబ్ అభివృద్ధి కోసం దశలవారీగా ఈ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ పై మంత్రి కీలక ప్రకటన
ఈ క్రమంలో తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు తుది దశకు చేరుకున్నాయని, ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో ఈ విమానాశ్రయం ప్రారంభమవుతుందని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు.

భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి 97 శాతం పనులు పూర్తి
విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పర్యటించిన మంత్రి జనార్దన్‌రెడ్డి, విమానాశ్రయ పనులను పరిశీలించారు. జీఎంఆర్ ప్రతినిధులతో చర్చించాక, విలేకరులతో మాట్లాడారు. మంత్రి చెప్పిన వివరాల ప్రకారం, భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి 97 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జులై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో దీనిని ప్రారంభించవచ్చు అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణాలు
ఎర్త్ రన్‌వే 100%, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) 95% పూర్తయ్యాయని వెల్లడించారు. అనుసంధాన రహదారుల అభివృద్ధి త్వరలో కొలిక్కి రానుందని తెలిపారు. ఇక ఇదే క్రమంలో రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. విశాఖ నుంచి ఏడు ప్రాధాన్య రహదారుల అభివృద్ధి పురోగతిలో ఉండగా, ఆనందపురం కూడలి వద్ద ఎలివేటెడ్ రోడ్ డీపీఆర్ తయారీ జరుగుతోందన్నారు.
జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి
మాజీ సీఎం జగన్, వైసిపి గత వైఖరిపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శలు చేశారు. భోగాపురం విమానాశ్రయంపై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నాడు చెప్పింది ఒకటి.. చేసింది మరొకటి అని ఆయన ఆరోపించారు. ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఎందుకు? అని అప్పట్లో ప్రశ్నించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే నిర్మాణం తమ ప్రభుత్వమే ప్రారంభించిందన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రత్యేక దృష్టి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి త్వరితగతిన నిర్మాణం జరిగేలా చూశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications