ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పైన శుభవార్త చెప్పారు కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. మరో ఆరు నెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తుందని, విమాన రాకపోకలతో వినియోగంలోకి రానుందని ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం అప్పుడే
2026 సంవత్సరంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎయిర్పోర్టులో యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు జరిగాయి. ప్రస్తుతం తుది దశలో నిర్మాణ పనులు ఉన్నాయి. 2026 జూన్ నాటికి ఎయిర్ పోర్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ముందు భావించినా, పనులు పూర్తవుతున్న క్రమంలో ఒక నెల ముందుగానే మే నెలలో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యు సిటీ ప్రాజెక్టు ఒప్పందం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంటుందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యు సిటీ ప్రాజెక్టు ఒప్పందం సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఈ ఒప్పందం చరిత్రలోనే నిలిచిపోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ప్రాధాన్యత ఇస్తున్న కారణంగానే ఈ రంగం చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని కేంద్రమంత్రికి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
చంద్రబాబు పై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు
ఏవియేషన్ రంగంలో శిక్షణకు తోడ్పడే విధంగా చేసుకున్న ఒప్పందం ఎన్నో విద్యాసంస్థలు, యూనివర్సిటీల స్థాపనకు మార్గం సుగమం చేయనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయం,, మౌలిక సదుపాయాలు, ఏవియేషన్ రంగం పైన భావితరాలను దృష్టిలో ఉంచుకునే ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఉత్తరాంధ్రను ఆయన తీర్చిదిద్దుతున్నారు అని రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు.
ప్రపంచాన్నే ఉత్తరాంధ్రకు తెచ్చే ప్రయత్నం
ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్, ఏవియేషన్ ఎడ్యు సిటీ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులనీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇవి సంకేతాలని ఆయన అన్నారు. వలసలు వెళ్ళే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రపంచాన్నే ఇక్కడకు తెచ్చే ప్రయత్నం జరుగుతుందని మంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications