ఏపీలో ఫీజురీయింబర్స్ మెంట్ పై గుడ్ న్యూస్..! సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ (fee reimbursement) కోసం ఎదురుచూస్తున్న కాలేజీలు, విద్యార్ధులు, తల్లితండ్రులకు ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. నెల రోజుల క్రితమే కాలేజీలకు రూ.1200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని ప్రభుత్వం విడుదల చేసినా అవి ఇప్పటికీ వారికి అందలేదు. ఇందులో ప్రభుత్వం పెట్టిన ఓ మెలికే కారణం. దీనిపై కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. దీంతో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సవరించుకుంది.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలలో వడ్డీని మినహాయించుకుంటామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం వద్ద నిధుల్లేకపోయినా రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నామని, కాబట్టి ఆ అప్పుపై 7.5 శాతం వడ్డీ కాలేజీలు భరించాలని అధికారులు ప్రతిపాదన చేశారు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాయి. దీనిపై నిన్న జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు స్పందించారు. అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు.

దీంతో వారు తమ నిర్ణయాన్ని సవరించుకుని పూర్తి స్దాయిలో వడ్డీ మినహాయింపు లేకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ చేసేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు కోతల్లేకుండా మొత్తం ఫీజుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే తొలి విడతగా సాంఘిక సంక్షేమ శాఖ బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ.300 కోట్ల ఫీజులను ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు మిగిలిన 900 కోట్ల బకాయిలను ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలకు హామీ ఇచ్చింది. దీంతో వారు కూడా శాంతించారు. అలాగే విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల సమస్య తీరినట్లయింది.












Click it and Unblock the Notifications