AP Govt: ఏపీలో విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్..! సర్కార్ కీలక ఉత్తర్వులు..!
ఏపీలో విద్యార్ధులకు కూటమి సర్కార్ (ap govt) మరో గుడ్ న్యూస్ చెప్పింది. విద్యార్ధులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్ని ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న బకాయిల్లో రూ.1200 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విద్యార్ధులకు పరీక్షల హాల్ టికెట్లు, అలాగే పరీక్షలు పూర్తిచేసిన తర్వాత సర్టిఫికెట్లను కాలేజీలు ఆపకుండా ఇచ్చేందుకు వీలు కలిగింది.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచీ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం కూడా అరకొరగానే నిధులు కేటాయిస్తుండటంతో దాదాపు 7 వేల కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. వీటిలో ఇప్పుడు 1200 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుతున్న విద్యార్ధులకు ఊరట దక్కనుంది. ప్రభుత్వ ఉత్తర్వులపై విద్యార్ధులు, తల్లితండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ కోర్సుల్లో పూర్తి ట్యూషన్ ఫీజును ఆయా కాలేజీలకు రీయింబర్స్ మెంట్ చేస్తున్నారు. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులు, మైనార్టీలకు దీన్ని వర్తింపజేస్తున్నారు. ఇందులో ట్యూషన్, స్పెషల్, ఇతర, పరీక్ష ఫీజులను కాలేజీ ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ ఫీగా ఆహారం, హాస్టల్ ఖర్చులకు ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్‌కు 15వేలు, డిగ్రీ, పైన విద్యార్ధులకు 20 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications