జగన్ అక్రమాస్తుల కేసులో బిగ్ టర్నింగ్-మరో బెంచ్ కు మార్చిన సుప్రీం..!
ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై దాఖలైన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై కొత్తగా వచ్చిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పిటిషన్ కాస్తా మరో బెంచ్ విచారణకు రాబోతోంది. అలాగే ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ పిటిషన్ విచారణ ఇప్పుడు తాజాగా మరో టర్న్ తీసుకున్నట్లయింది.

గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజు.. పార్టీ అధిష్టానంతో విభేదించారు. అనంతరం పార్టీ అధినేత జగన్ కు గతంలో అక్రమాస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని, అలాగే హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టులోని సీజేఐ బెంచ్ లో విచారణ జరిగింది. అయితే తాజాగా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ మారారు.
అలాగే బెంచ్ లో ఉన్న న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ పిటిషన్లను విచారించలేనంటూ నాట్ బిఫోర్ మీ అన్నారు. దీంతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా అనివార్యంగా మరో బెంచ్ కు వీటిని మార్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రఘురామరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని మరో బెంచ్ కు సీజే బదిలీ చేశారు. అలాగే డిసెంబర్ వీటిపై విచారణ జరిగేలా రిజిస్ట్రీకి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ పిటిషన్ల విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడినట్లయింది.












Click it and Unblock the Notifications