వైఎస్ జగన్ మేనమామకు ఆన్‌రాక్ వాటాలు: వైసిపి నేతలను 5కిమీ నడిపించిన గిరిజనులు
విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం బాక్సైట్ నిక్షేపాలు ఉన్న గూడెం కొత్తవీధి మండలం జర్రెల కొండ (బోడమ్మ బీడింగ్) ప్రాంత సందర్శనకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి, జిల్లా నాయకులను గిరిజనులు అడ్డుకొన్నారు.
జగన్‌కు మేనమామ వరుసైన పెన్నా ప్రతాపరెడ్డికి అన్‌రాక్‌లో వాటాలున్నాయని, ముందు ఆ కంపెనీని మూయించి, ఆ తర్వాత బాక్సైట్‌పై పోరాడాలని గిరిజనులు చెప్పారు. ఎమ్మెల్యేసహా నాయకులందరినీ సంప్రదాయ ఆయుధాలతో చుట్టుముట్టి సుమారు 5 కిలోమీటర్ల మేర కొండల్లో నడిపించారు.

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పెట్ల గణే్‌షతోపాటు జర్రెల సర్పంచి విజయకుమారి, జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు, పాడేరు, జి.మాడుగుల మండలాలకు చెందిన పార్టీ సర్పంచులు, నాయకులు సోమవారం జర్రెలకు వచ్చారు.
బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వ అనుమతిని వ్యతిరేకిస్తూ గిరిజనులతో సమావేశం నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు గ్రామానికి చేరుకొన్న వైసీపీ నాయకులు ఆదివాసీలు వచ్చేలోపు బాక్సైట్ కొండలను పరిశీలిద్దామని బోడమ్మ బీడింగ్‌కు బయలుదేరారు. సుమారు గంటపాటు కొండలను పరిశీలించారు.
వైసీపీ నాయకులు బాక్సైట్ కొండపైకి వెళ్లారని తెలుసుకున్న కోండ్రుపల్లి, బుడ్డలగొంది, పెబ్బెంపల్లి, రాసకోట గ్రామాల గిరిజనులు తీవ్రంగా మండిపడ్డారు. వైసిపి నాయకులను గిరిజనులు చుట్టుముట్టారు. తమకు చెప్పకుండా కొండ ఎందుకు ఎక్కారంటూ నిలదీశారు. జర్రెల వెళ్లి మాట్లాడుకుందామంటూ వైసీపీ నాయకులు అప్పటికే అక్కడికి వచ్చిన తమ వాహనాలను ఎక్కేందుకు ప్రయత్నించగా గిరిజనులు అడ్డుకున్నారు.
జర్రెల వరకు సుమారు 5 కిలోమీటర్లు వైసిపి నాయకులను కొండల్లో గుట్టల్లో నడిపించారు. జర్రెల చేరుకొన్న తర్వాత వైసీపీ నాయకులను కోండ్రుపల్లి వచ్చి బహిరంగ సమావేశం ఏర్పాటు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. జర్రెలలోనే బహిరంగ సమావేశం పెట్టుకుందామని సూచించారు. దీంతో శాంతించిన గిరిజనులు జర్రెలలో బాక్సైట్ వ్యతిరేక సమావేశం ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.












Click it and Unblock the Notifications