పొత్తుల్లో కొత్త చిక్కులు, ఢిల్లీ గేమ్ - చంద్రబాబుకు కొత్త టెన్షన్..!!
ఏపీలో పొత్తుల లెక్కల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ఓటమి లక్ష్యం ఇప్పటికే టీడీపీ,జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీతో తాజాగా చంద్రబాబు చర్చలతో తిరిగి 2014 పొత్తులు ఖాయం అనే చర్చ మొదలైంది. పొత్తులు ఖాయమైనా సీట్ల వ్యవహారం ఇప్పుడు మూడు పార్టీల్లో చిక్కుముడిగా మారింది. జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా 50-60 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కోరుతున్నారు. చంద్రబాబు 35-40 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు ఇస్తానని ప్రతిపాదించినా బీజేపీ అంగీకరించటం లేదని సమాచారం.
కీలక పరిణామాలు : టీడీపీకీ ఈ ఎన్నికలు నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం జనసేనతో పాటుగా బీజేపీతోనూ పొత్తుకు సిద్దమయ్యారు. తాజాగా అమిత్ షా తో చర్చల తరువాత పొత్తు దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. ఈ సమయంలోనే సీట్ల పంపకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. జనసేనకు 25-27 సీట్లు ఇచ్చేలా చంద్రబాబు- పవన్ మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. 3 ఎంపీ స్థానాలు ఖాయమయ్యాయి. బీజేపీ తమకు 8 ఎంపీ, 25 అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతోంది. చంద్రబాబు బీజేపీకి 4-5 ఎంపీ, 15 వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే, బీజేపీ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

సీట్ల కేటాయింపు : తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ బీజేపీ సొంతగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాదిన జేడీఎస్, టీడీపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకుందని సమాచారం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 15 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. అయితే.. ఇప్పుడు జనసేన పోటీ చేయబోతోంది. పొత్తులో 40-50 సీట్ల కంటే తక్కువగా తీసుకోవద్దంటూ పవన్ పైన పార్టీ నేతలు..అభిమానుల నుంచి ఒత్తిడి ఉంది. ఇదే సమయంలో బీజేపీ నుంచి సీట్ల పైన భారీ డిమాండ్ తెర మీదకు వస్తోంది. ఎంపీ సీట్ల విషయంలో చంద్రబాబు కొంత మేర సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు 4 ఎంపీ సీట్లు ఇస్తే తాము పొత్తుతో రావాల్సిన అవసరం లేదని బీజేపీ నేతలు తాజాగా వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో, చంద్రబాబు పునరాలోచనలో పడ్డారని సమాచారం.

ఢిల్లీ కేంద్రంగా రాజకీయం : ఇక, పొత్తుల్లో రెండు పార్టీలు 40-45 స్థానాలు కేటాయిస్తే సొంత పార్టీ నేతలకు ఏం చెప్పాలనేది చంద్రబాబు లో కొత్త టెన్షన్ మొదలైంది. పార్టీలో ఒక్కో నియోజకవర్గంలో సీట్ల కోసం పోటీ కొనసాగుతోంది. జనసేన తో పొత్తు ఖాయమైన సమయం నుంచి కొన్ని సీట్లలో రెండు పార్టీల నుంచి పోటీ కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు బీజేపీ కి సీట్లు కేటాయించాల్సి రావాల్సి రావటంతో ఇప్పుడు మూడు పార్టీల నుంచి ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే, పొత్తుల రాజకీయం పైన ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో పొత్తుల పైన ఎలాంటి నిర్ణయాలు వెలువడతానే రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications