రక్తికట్టని వైజాగ్ స్టీల్ డ్రామా- పవన్-బీజేపీ భారీ ప్లాన్- అదను చూసి బయటపెట్టే వ్యూహం
ఏపీలో 2024 ఎన్నికలే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్నట్లు గతంలో ప్రకటించిన బీజేపీ, జనసేన పార్టీలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు, ప్రజలు ఏమనుకున్నా ఫర్వాలేదు కానీ తమ రాజకీయం మాత్రం తాము కొనసాగిస్తానే లక్ష్యాన్ని అందుకుంటామన్న భావనలో ఉన్న ఇరు పార్టీలు.. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు వారి ప్రయోజనాల్ని నెరవేరుస్తుందో లేదో తెలియదు కానీ.. జనం చెవిలో మాత్రం పూలుపెట్టేందుకు బాగా ఉపయోగపడుతోంది. అదే సమయంలో కేంద్రానికి భయపడి వైసీపీ, టీడీపీ నోరెత్తని వైనం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

బీజేపీ-జనసేన పొత్తు
2019 ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బీజేపీ, జనసేన తిరిగి పొత్తు పెట్టుకుందామని భావించాయి. 2014 లో పొత్తుతో బీజేపీకీ లబ్ధి చేకూర్చిన జనసేన... ఈసారి తాము స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకపోవడంతో తిరిగి 2019 ఎన్నికల తర్వాత మరోసారి బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది. ఆ సందర్భంగా ఇరుపార్టీలు 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాయి. పేరుకు అలా ప్రకటించాయే కానీ ఇప్పటివరకూ కలిసి పనిచేసిందే లేదు. అప్పుడప్పుడూ ఉమ్మడి పోరాటాలకు పిలుపునివ్వడం మినహా పోరాటాలు చేసిన చరిత్ర లేదు. కానీ ఇప్పటికి ఓ అంశం మీద మాత్రం ఇరువురూ వ్యూహాత్మకంగా కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

కలిసుంటూనే విడిగా పోరాటం
ఏపీలో బీజేపీ, జనసేన కలిసి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాక... ఎన్నో అంశాల్లో ఇరు పార్టీలు విడివిడిగా పోరాటాలు చేసుకున్నాయి. మిత్రపక్షాలే అయినప్పటికీ విడిగా పోరాటాలు చేసుకోవడంతో ఇరు పార్టీలు అసలు కలిసున్నాయా లేదా అన్నదానిపై అనుమానాలు మొదలయ్యాయి. వీరిద్దరూ త్వరలో విడిపోవడం ఖాయమన్న ప్రచారాలు కూడా మొదలయ్యాయి. అయితే ఇరు పార్టీలు నేరుగా దీనిపై ఎక్కడా స్పందించలేదు. ఇలా ఇరు పార్టీలు దూరం జరుగుతున్న క్రమంలో జనసేన తీసుకున్న ఓ నిర్ణయం కలకలం రేపింది.

వైజాగ్ స్టీల్ పోరాటంలోకి పవన్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకున్న 9 నెలల తర్వాత దీనిపై పోరాటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. వైజాగ్ స్టీల్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందంటూ అఖిలపక్ష పోరాటానికి పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని వైసీపీ సర్కార్ ను డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీగా ఆ బాధ్యత వైసీపీ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతవరకూ బాగానే ఉన్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పోరాడుతూనే వారితో మిత్రపక్షంగా ఉండటం నైతికమా కాదా అన్న విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు.

పవన్ మార్క్ రాజకీయం
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయం కాబట్టి.. దానికి వ్యతిరేకంగా వారికి గుడ్ బై చెప్పేయాలి. లేదా మిత్రపక్షాన్ని నొప్పించకూడదన్న భావనతో అలాంటి పోరాటాలు చేయకుండా మౌనంగా అన్నా ఉండాలి. కానీ పాతికేళ్ల రాజకీయం పేరుతో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో కలిసుంటూనే వైజాగ్ స్టీల్ పోరాటం ప్రారంభించేశారు. దీంతో అటు బీజేపీతో స్నేహం చేస్తూనే మరోవైపు ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేస్తున్నట్లవుతోంది. దీన్ని పవన్ సమర్దించుకోలేని పరిస్ధితి.

పవన్ పోరాటంపై నోరెత్తని బీజేపీ
కేంద్రం తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మితపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంటే దాన్ని తప్పుబట్టాల్సిన బీజేపీ మాత్రం మౌనంగా ఉండిపోతోంది. మిగతా ప్రత్యర్ధి పార్టీల్లాగే జనసేన కూడా పోరాటం చేస్తున్నట్లే బీజేపీ భావిస్తోంది. చిన్నా చితకా అంశాలకు ప్రత్యర్ధి పార్టీలపై నిప్పలు చెరిగే బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు ఇప్పుడు మిత్రపక్షం జనసేన తమ నిర్ణయంపై పోరాటం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీంతో రాజకీయాల్లో ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
Recommended Video

బీజేపీ, జనసేన మైత్రి వెనుక భారీ వ్యూహం ?
మిత్రపక్షాలుగా ఉంటూ ఉమ్మడిగా పోరాటాలు చేయాల్సిన పరిస్దితుల్లో విడివిడిగా నిర్ణయాలు తీసుకుంటూ, ఇప్పుడు పరస్పరం పోరుకు కూడా సిద్ధమవుతున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ, జనసేన పార్టీలు ఎందుకీ నాటకాలకు తెరతీస్తున్నాయనే దానిపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇందులో ప్రధానంగా వీరిద్దరూ భవిష్యత్తులో టీడీపీతో కలిసి పనిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యూహాలకు తెరదీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇద్దరూ విడిపోయే పరిస్ధితులు లేవు, అలాగని కలిసి పనిచేసే పరిస్ధితులు కూడా లేవు. ఎన్నికలు వస్తే తప్ప టీడీపీతో కలిసే అవసరం లేదు. దీంతో వ్యూహాత్మకంగా 2024 ఎన్నికల కోసమే వీరిద్దరూ ఇలా కలిసి ఉండీఉండనట్లుగా ఉంటూ సరైన సమయం కోసం ఎధురుచూస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications