పోటీ చేసే స్థానం, పొత్తులపై పురందేశ్వరి క్లారిటీ - ముఖ్యమంత్రి ఎవరంటే..!!
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి రాజకీయంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి పదవి పైనా ఆసక్తికరంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందిస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారిమళ్లిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు.తాను పోటీ చేసే స్థానం పైన పురందేశ్వరి స్పందించారు.
సమాధానం చెప్పాలి : ఏపీకి కేంద్రం 22 లక్షల ఇళ్ళు ఇచ్చిందని.. రాజమండ్రికి లక్షా 86 వేల ఇళ్లు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు పూర్తిచేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలో జాతీయ రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పంచాయతీల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించటం శోచనీయమన్నారు. సర్పంచులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పార్టీలకు తీతంగా బీజేపీ దగ్గరకు వచ్చిన సర్పంచులకు బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సర్పంచులకు మద్దతుగా ఆగస్టు 10న జిల్లా స్థాయిలో, ఆగస్టు 17న రాష్ట్ర స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఎక్కడా తప్పుకోలేదు : పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుకోలేదని పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిర్మాణానికి అవుతున్న ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తోందని ఆమె అన్నారు. పునరావాసానికి సంబంధించిన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని తెలిపారు. పోలవరం లెక్కలకు సంబంధించి ప్రభుత్వం సవరణ కోరిందని ఆ విషయంలో తాము కూడా త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవనున్నామని పురంధేశ్వరి ప్రకటించారు. ఆవ భూముల కొనుగోళ్ళలో వైసీపీ నేతలు దోచుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలే ఇసుక, మట్టి మాఫియాలుగా మారారన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోటం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.

పొత్తులపై అక్కడే నిర్ణయం : ఏపీలో ప్రజలకు మేలు చేయలేని స్థితిలో జగన్ ఉన్నారని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పోలవరం పునరావాస ప్యాకేజీ విషయంలో ఏపీ ప్రభుత్వం సరైన గణాంకాలు కేంద్రానికి ఇవ్వటం లేదన్నారు.కేంద్ర నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్తే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని పురంధేశ్వరి తెలిపారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మిగిలిన పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications