ఏపీపై బిజెపి పక్కా ప్లాన్, ఏం చేస్తుంది: బాబు-జగన్‌లకు చెక్ పెడతారా?
దక్షిణాదిపై దృష్టి సారించిన బిజెపి తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడం లేదా విపక్ష స్థాయికి ఎదగడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.
అమరావతి: దక్షిణాదిపై దృష్టి సారించిన బిజెపి తెలుగురాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడం లేదా విపక్ష స్థాయికి ఎదగడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందుకోసం పక్కాగా పావులు కదుపుతోందని అంటున్నారు. తెలంగాణలో సొంతగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది.
ఇక్కడ ఏ పార్టీతోను పొత్తు లేదు. ఏపీలో టిడిపితో పొత్తు ఉంది. కాని తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి దూరంగానే ఉంది. కాబట్టి తెలంగాణలో ఎదిగేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్ పీకారు. కేసీఆర్ ప్రభుత్వంపై సరైన విధంగా పోరాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సూచనలు చేశారు.

ఏపీలో బిజెపికి ఇబ్బందులు
ఏపీలోనే బిజెపికి ఎదిగేందుకు ఇబ్బందిక పరిస్థితి. ఎందుకంటే ఒకటి అక్కడ టిడిపితో పొత్తు. రెండోది ప్రత్యేక హోదా. అధికార పార్టీతో పొత్తు కారణంగా చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసినా, ఒప్పు చేసినా ఏం అనలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వ వ్యతిరేకత టిడిపితో పాటు ఎంతోకొంత బిజెపిపై కూడా ఉంటుంది.

అసలైన ఇబ్బంది.. ప్రజల ఆవేదనను ఆగ్రహంగా..
ఏపీలో బిజెపికి అసలైన ఇబ్బందికర పరిస్థితి ప్రత్యేక హోదా అంశం. ప్రస్తుతానికి దీని ప్రభావం అంతగా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ప్రత్యేక హోదాపై బీజేపీ హామీ ఇచ్చి, ఇప్పుడు వెనక్కి పోయింది. ప్రజల్లో ఈ ఆవేదన ఉంది. 2019 ఎన్నికల నాటికి ఇదే అంశాన్ని ఉపయోగించి ప్రజల ఆవేదనను బిజెపిపై ఆగ్రహంగా మార్చాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం అంతా కూల్‌గా కనిపిస్తోంది.

ఏదయితే అది
2019 ఎన్నికల్లోను బిజెపితో కలిసి వెళ్లాలని టిడిపి భావిస్తోంది. బిజెపి మాత్రం తమకు ఏది లాభిస్తే ఆ దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. అందుకు తమ ముందున్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది. టిడిపితో కలిసే ఉండటమా? జగన్‌తో కలవడమా, లేక వైసిపితో అంతర్గత ఒప్పందంతో ఒంటరిగా పోటీ చేయడమా? అవసరమైతే పవన్ కళ్యాణ్ మెప్పించి, ఒప్పించి సీఎం అభ్యర్థిగా ప్రకటించడమా? ఇలా అన్ని కోణాల్లోను యోచిస్తోంది.

జగన్, పవన్‌లను ఎలా మచ్చిక చేసుకుంటుంది?
2019లో ఏ రకంగా చూసినా ప్రత్యేక హోదా బిజెపికి చిక్కులు తీసుకు వచ్చే అంశమే. టిడిపిని వీడితో.. తాము హోదా, ఏపీకి లబ్ధి కోసమే కలిసున్నామని, బిజెపి మోసం చేసిందని ఆరోపిస్తుంది. జగన్, పవన్ కళ్యాణ్‌లు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తారు. మరి టిడిపిని దూరం పెట్టి... ప్రత్యేక హోదాకు బదులు ఇచ్చిన ప్యాకేజీపై జగన్, పవన్ కళ్యాణ్‌లను ఎలా మచ్చిక చేసుకుంటుందోననేది ఉత్కేఠం.

అందరిపై దృష్టి
బిజెపి ఏపీలో మైనార్టీలు సహా అన్ని వర్గాల పైన దృష్టి సారించింది. సాధ్యమైనన్ని సీట్లను వచ్చే ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. జగన్ లేదా చంద్రబాబు ద్వారా వారి వారి సామాజిక వర్గాలు దరి చేరుతాయని భావిస్తోంది. పవన్ ద్వారా కాపులకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. సోము వీర్రాజు వంటి కీలక నేతలు బిజెపికి ఉన్నారు.

టిడిపితో పొత్తుపై ఆరా తీస్తున్న ఢిల్లీ
బిజెపి ఢిల్లీ పెద్దలు ఏపీ నేతల నుంచి సమాచారం రాబడుతున్నారు. దాని ఆధారంగా 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు ఉంటుందంటున్నారు. ఎక్కువ మంది బిజెపి నేతలు టిడిపితో దూరం జరిగేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి ఏం చేసి అయినా వచ్చే ఎన్నికల నాటికి టిడిపి, వైసిపిలకు ధీటుగా ఎదగాలని భావిస్తోంది.

జగన్‌ను దారిలోకి తెచ్చుకుంటారా?
2019 ఎన్నికల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న బిజెపి కచ్చితంగా టిడిపికి దూరం జరుగుతుందనే భావించవచ్చునని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా జగన్‌తో ఎన్నికల తర్వాత పొత్తు ఒప్పందం కుదుర్చుకొని, ఒంటరిగా పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. మొత్తానికి తాము ఎదిగేందుకు అవసరమైతే చంద్రబాబుకు, అలాగే జగన్‌కు చెక్ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు. అటే చంద్రబాబును వదిలేయడం, అలాగే జగన్‌కు కేసుల బూచీ చూపించి దారిలోకి తెచ్చుకోవడం చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications