టీ బిల్లు: మంత్రులకు వెంకయ్య ప్రశ్నలు, జైట్లీ ఆరా
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై మద్దతు కోరిన కేంద్ర మంత్రి జైరాం రమేష్‌కు బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు. జైరాం రమేష్ తెలంగాణ బిల్లుపై చర్చించేందుకు సోమవారం రాత్రి వెంకయ్య నాయుడిని కలిశారు. కాగా, బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలనే నిర్ణయంలోని ఆంతర్యం ఏమిటని మరో బిజెపి నేత అరుణ్ జైట్లీ ఆరా తీస్తున్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెసు తమను ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని ఎంచుకుందనే భావనకు బిజెపి నేతలు గురైనట్లు కనిపించింది. విభజన జరిగితే తాను క్రెడిట్ కొట్టేసి, జరగకపోతే నెపాన్ని ఇతరులపైకి నెట్టే వ్యూహాన్ని కాంగ్రెసు అధిష్టానం ఎంచుకున్నట్లు బిజెపి భావిస్తోంది. దీంతో దాన్ని ఎదుర్కోవాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు కనిపిస్తోంది. మంగళవారం రాజ్యసభలో విభజన బిల్లు ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం సమాచారమివ్వడంతో సభలో బిజెపి పక్ష నేత అరుణ్‌జైట్లీ సోమవారం పార్టీ అగ్రనేత అద్వానీతో చర్చలు జరిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నప్పటికీ కాంగ్రెసు కుతంత్రాలకు లోబడి బిల్లుకు మద్దతు ఇవ్వవద్దని అద్వానీ జైట్లీతో చెప్పినట్లు సమాచారం.

ఇదిలావుంటే, తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని జైరాం రమేష్ వెంకయ్యనాయుడిని కలిసి కోరారు. సీమాంధ్రకు జరిగే అపారమైన నష్టాన్ని పూరించాలని, అందుకు ప్యాకేజీ ప్రకటించాలని కోరామని, వాటిని పరిశీలిస్తామంటే అంగీకరించినట్లా అని వెంకయ్యన నాయుడు జైరాం రమేష్‌ను నిలదీసినట్లు చెబుతున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక కేటగిరీ కింద నిధులు కేటాయించాలని అడిగితే దాన్ని పట్టించుకోలేదని తెలిపారు.
ఆర్థిక ప్యాకేజీలు పొందుపరిస్తే తొలుత బిల్లును లోకసభలో ప్రవేశపెట్టాల్సి వస్తుందని, అందుకే బిల్లులో పెట్టలేదని జైరాం రమేష్ వివరణ ఇచ్చినా వెంకయ్య వెనక్కి తగ్గలేదని సమాచారం. అప్పుడు లోక్‌సభలోనే తొలుత పెట్టవచ్చు కదా అని వెంకయ్య ప్రశ్నించారు. "ఈ నిధులన్నీ కేటాయిస్తూ వాటి వివరాలను ఆర్థిక పత్రంలో పొందుపరుస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టాలని, అప్పుడు మద్దతు ఇవ్వడంపై తప్పనిసరిగా పరిశీస్తామని వెంకయ్య చెప్పారు.
బిల్లును తాము రాజ్యసభలోనే తొలుత ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జైరాం చెప్పారు. అలాగైతే తాము బిల్లును వ్యతిరేకిస్తామని, రాజ్యాంగపరమైన అంశాలను లేవనెత్తుతామని,త హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి, గవర్నర్‌కు అధికారాలు కల్పించినప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని పట్టుబడతామని, తమ నేత అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని తప్పకుండా లేవనెత్తుతారని అని వెంకయ్యనాయుడు చెప్పారు.
రాష్ట్ర విభజన బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకోవడంలో ఔచిత్యాన్ని ప్రశ్నిస్తామని రాజ్యసభలో బిజెపి పక్ష నేత అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థికపరమైన అంశాల ప్రతిపాదనలున్నందువల్ల ఈ బిల్లును తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలన్నారు. ఈ ప్రభుత్వ హయాంలోని... చివరి సమావేశాల్లో విభజన బిల్లు ప్రవేశపెట్టడానికి నిర్ణయించి, ఇప్పుడు తమతో సంప్రదించాలని ప్రధాని భావించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రభుత్వ వైఖరిని గట్టిగా నిలదీస్తామని ఆయన మీడియాకు తెలిపారు.












Click it and Unblock the Notifications