వారంతా అజ్ఞానులు, పార్టీ నుంచి జంప్ చేసేవారే: బొత్స
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి అభ్యర్థులే దొరకరని అంటున్నవారిపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. అలా అంటున్నవారు అజ్ఞానులని ఆయన అన్నారు. కాంగ్రెసు నుంచి తప్పుకుని ఇతర పార్టీల్లో చేరాలని నిర్ణయించుకున్నవారే విమర్శలు చేస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తిరుబాటు పార్లమెంటు సభ్యుల బహిష్కరణకు, విభజన బిల్లుకు సంబంధం లేదని ఆయన అన్నారు. వారు బహిష్కరణకు గురైనా ఇతర సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తారని ఆయన చెప్పారు. విభజన ప్రక్రియపై ఎంపీల బహిష్కరణ ప్రభావం ఉండదని ఆయన అన్నారు.

ఆరుగురు పార్లమెంటు సభ్యులను పార్టీ నుంచి బహిష్కరించినట్లు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. విభజనపై శాసనసభలో కాంగ్రెసు శాసనసభ్యులు ప్రాంతాలవారీగా వ్యవహరించినట్లుగానే పార్లమెంటులో ఎంపీలు కూడా వ్యవహరిస్తారని బొత్స చెప్పారు.
విభజన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెసుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. తమ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులే దొరకరనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications