APలో చివరి నిముషంలో KCR వ్యూహం మార్పు?
భారత రాష్ట్ర సమితిగా ఏపీలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతోన్న బీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి సిద్ధమవుతోంది. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావల్సిన 6 శాతం ఓటింగ్ ను ఏపీ నుంచి కూడా సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అంతేకాకుండా పార్టీ విస్తరణను వేగవంతం చేయాలనేది కేసీఆర్ యోచనగా ఉంది.

ఆరు శాతం ఓటుబ్యాంకే లక్ష్యం
ఏపీలో చేరికలను ప్రోత్సహిస్తూనే మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోను పోటీచేయడానికి బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను కేసీఆర్ ఏపీ నేతలకు అందజేశారు. ఏపీ ఎన్నికల్లో పోటీచేసి బీఆర్ఎస్ బలం నిరూపించుకోవడంతోపాటు జాతీయ పార్టీకి అవసరమైన ఓటుబ్యాంకు శాతాన్ని కూడా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో కమ్యూనిస్టులు కలిసివస్తున్నప్పటికీ ఏపీలో వారితో పొత్తుంటుందా? లేదా? అనేది స్పష్టత రాలేదు. ఏపీలోని సీపీఐ టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లాలనుకుంటోంది. సీపీఎం అభిప్రాయం తెలియాల్సి ఉంది.

ఒంటరిపోరుకే మొగ్గు?
BRS ఒంటరి పొరుకే మొగ్గు చూపుతోంది. ఏపీలో సామాజిక సమీకరణాలు.. రాజకీయ పార్టీల వ్యూహాలను అంచనా వేసి అభ్యర్థులను బరిలోకి దింపాలని చూస్తోంది. సాదా సీదా అభ్యర్థులు కాకుండా ఓట్లను రాబట్టి, ప్రత్యర్థి పార్టీల జయాపజయాలను నిర్ణయించే శక్తి ఉన్న బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని గులాబీ దళంలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు ఎక్కడెక్కడ ఆదరణ ఉంటుంది? ఎక్కడెక్కడ ఓటింగ్ శాతం పెరుగుతుంది? తదితరాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు.

చివరి నిముషంలో వ్యూహం మార్పు?
ఏపీలో రాజకీయ పరిస్థితులను సమీక్షించి చివరి నిముషంలో వ్యూహాన్ని మార్చే అవకాశం కూడా కనపడుతోంది. ప్రస్తుతానికి మాత్రం ఏపీలో కాపు ఓటుబ్యాంకును గుంపగుత్తగా కొల్లగొట్టాలంటే ఏం చేయాలనేదానిపై ఆ పార్టీలో మేథోమధనం జరుగుతోంది. ప్రస్తుతానికి కాపు ఓటుబ్యాంకు జనసేన వైపు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ మొదటి అడుగు పడినప్పుడు మాత్రమే ఆ పార్టీ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతోంది? అనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications