తూర్పుగోదావరి జిల్లాలో యువకుడి దారుణ హత్య; శరీర భాగాలు ముక్కలుగా చేసి రోజుకో భాగాన్ని...
తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొల్లాపూర్ లో ఒక యువకుడి హత్య స్థానికంగా సంచలనం సృష్టించింది. నవంబరు నెల 24వ తేదీన నాగ సాయి అలియాస్ వెంకటేష్ అన్న 25 సంవత్సరాల యువకుడిని నలుగురు నిందితులు కలిసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

యువకుడి దారుణ హత్య
నాగ సాయి అలియాస్ వెంకటేష్ ను హతమార్చిన నిందితులు, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి, రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కోలమూరు వాసులు షాక్ కు గురయ్యారు. ప్రతిరోజు అతని శరీర భాగాలను దహనం చేయడంతో దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సగం కాలిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.

శరీర భాగాలు ముక్కలు చేసి రోజుకో భాగం దహనం
ఒక వ్యక్తిని హతమార్చి అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి, రోజుకొక భాగం చొప్పున దహనం చేస్తున్నట్లుగా రాజనగరం పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఈ హత్య కేసులో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక వెంకటేష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మర్డర్ మిస్టరీ చేదించే పనిలో పోలీసులు
ఈ కేసులో నాగ సాయి అలియాస్ వెంకటేష్ ను హతమార్చిన నిందితులు ఎవరు? వారు దేనికోసం వెంకటేష్ ను హతమార్చారు. వ్యక్తిగత తగాదాలా , లేక ప్రేమ వ్యవహారమా, అదీ కాకుంటే ఆస్తి పంచాయితీలా ? అన్న కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక ఈ సంఘటన గ్రామంలో భయాందోళనకు కారణంగా మారింది.

మనషుల్లో రోజు రోజుకీ పెరుగుతున్న నేర ప్రవృత్తి
ఏది ఏమైనా ఒక వ్యక్తి ప్రాణాలు తీయడమే దారుణం అయితే, ఇక మృతదేహాన్ని అత్యంత కర్కశంగా ముక్కలు కోసి, రోజుకో ముక్క చొప్పున దహనం చేస్తున్నారంటే వాళ్లు ఎంతటి రాక్షస మనస్తత్వం ఉన్న నేరగాళ్ళు అనేది అర్థం చేసుకోవచ్చు. సమాజంలో ఈ తరహా నేరప్రవృత్తి మనుషుల్లో పెరగడం అత్యంత హానికరమని మానవతావాదులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా మనుషుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ నేరాలను నియంత్రించేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications