మహిళా కూలీల సజీవదహనం హృదయ విదారకం, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే: పవన్ కళ్యాణ్
శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హైటెన్షన్ వైర్లు తెగి పడి ఆటో దగ్ధమైన ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనం అయిన ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మహిళా కూలీలు సజీవ దహనం ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
వ్యవసాయ పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఆ వాహనంపై విద్యుత్ తీగలు పడి ఈ ఘోరం చోటు చేసుకుందని తెలిసిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటుచేసుకున్న హృదయవిదారకమైన ఈ విషాదం తన మనసును కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్
మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని, ఆ కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. అంతేకాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ హై టెన్షన్ తీగ తెగి పడటం మానవ తప్పిదమా లేక నిర్వహణ లోపమా చెప్పాలని ప్రశ్నించారు.

విద్యుత్ చార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధ విద్యుత్ లైన్ల నిర్వహణపై చూపాలి
వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగి పడటం మనం చూస్తూనే ఉంటామని పేర్కొన్న పవన్ కళ్యాణ్, వాతావరణం సాధారణంగా ఉన్న సమయంలో కూడా హై టెన్షన్ తీగ తెగి పడ్డ తీరుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధ ప్రభుత్వం విద్యుత్ లైన్ల నిర్వహణపై చూపాలని తాను సూచిస్తున్నా అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలన్న పవన్ కళ్యాణ్
అనేక ప్రాంతాలలో విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి ఉంటున్నాయని, జనావాసాల మీద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఈరోజు ఐదు నిండు ప్రాణాలు పోయాయని గుర్తుంచుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాడిమర్రి దగ్గర చోటుచేసుకున్న దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిన జగన్
ఇదిలా ఉంటే తాడిమర్రి వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీలు సజీవ దహనమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications