టీడీపీలో చేరిన బైరెడ్డి కుమార్తె శబరి-ఆ ఎంపీ టికెట్ కేటాయించే ఛాన్స్..!
ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయలసీమకు చెందిన టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరీ రెడ్డి ఇవాళ టీడీపీలో చేరారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, భూమా అఖిలప్రియ సహా సహా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన నేతలంతా వచ్చారు.
రాయలసీమలోని కీలకమైన నంద్యాల ఎంపీ సీటులో టీడీపీ ఈసారి బలమైన అభ్యర్ధి కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో టీడీపీలో ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కుమార్తె, బీజేపీ నేత అయిన బైరెడ్డి శబరితో ఆ పార్టీ నేతలు టచ్ లోకి వెళ్లారు. ఆమెను బీజేపీ నుంచి టీడీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికల సమయం కావడం, బీజేపీతో కూటమి కట్టడం వంటి కారణాలతో శబరి టీడీపీలో చేరిక ఆలస్యమైంది.

ఎట్టకేలకు బైరెడ్డి శబరి ఇవాళ టీడీపీలో చేరిపోయారు. దీంతో నంద్యాల ఎంపీ అభ్యర్ధిగా ఆమెను బరిలోకి నిలబెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకూ టీడీపీ ఎంపీ అభ్యర్ధుల జాబితా విడుదల కాలేదు. రేపు ఈ లిస్ట్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో బైరెడ్డి శబరి పేరును నంద్యాల ఎంపీగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అటు వైసీపీ నుంచి కూడా నంద్యాల ఎంపీ అభ్యర్ధి ఖరారు కాలేదు. అయితే రేపు ఇడుపుల పాయలో జగన్ కూడా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తున్నారు.

రాయలసీమలో నీటి కోసం ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉన్న బైరెడ్డిని, ఆయన కుటుంబాన్ని చేరదీయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బైరెడ్డి కుటుంబాన్ని చేరదీయడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications