అరెస్టు: ఓ రోజు గడిపితేనే అంటూ మహిళను బ్లాక్‌మెయిల్ చేసిన రామకృష్ణ
విశాఖపట్నం: కాల్ మనీ కేసులో విశాఖపట్నం నగరానికి చెందిన గుడివాడ రామకృష్ణను గురువారం అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం డీసీపీ-2 సీహెచ్ త్రివిక్రమవర్మ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుడివాడ రామకృష్ణ పెదవాల్తేరులోని విజయనగర్ కాలనీలో నివాసముంటూ వచ్చాడు.
పదో తరగతి వరకూ చదువుకున్న రామకృష్ణ 1983 లో ఫ్యాన్సీ దుస్తుల వ్యాపారం ప్రారంభించాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌తోపాటు ఫైనాన్స్ వ్యాపారం మొదలుపెట్టాడు. అప్పు తీసుకునే వాళ్ల నుంచి ఖాళీచెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకునేవాడు. వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించి ఇచ్చిన దానికి పదింతలు వసూలు చేసేవాడు.

రామకృష్ణపై 1993లో టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో మోటారు సైకిల్ దొంగతనం కేసు నమోదైంది. ఆదర్శ నగర్‌కు చెందిన ఒక వివాహిత తన ఇంటి అవసరాల కోసం బంగారు ఆభరణాలను ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టారు. వాటికి వడ్డీ కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు వేలం నోటీసు పంపించారు. దీంతో ఆమె తన స్నేహితురాలైన హైమావతిని సంప్రదించింది. హైమావతి ఆమెను గుడివాడ రామకృష్ణకు పరిచయం చేసింది.
రామకృష్ణ ఆమె వద్ద నుంచి ఖాళీ చెక్కులు ప్రామీసరీ నోట్లు తీసుకుని రూ.4 లక్షలు ఫైనాన్స్ కంపెనీకి చెల్లించి బంగారు ఆభరణాలను విడిపించి, తన వద్ద ఉంచుకున్నాడు. రామకృష్ణ చెల్లించిన మొత్తాన్ని వడ్డీసహా ఆమె చెల్లించి తన ఆభరణాలు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇవ్వాలని కోరింది. అయితే ‘నువ్వు లేదా నీ స్నేహితురాలు ఎవరో ఒకరు నాతో ఒక రోజు గడిపితే వాటిని ఇచ్చేస్తాను. లేకపోతే ఇచ్చేది లేదు' అంటూ బెదిరించాడు. దీంతో బాధితురాలు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

లాసన్స్‌బే కాలనీకి చెందిన విశ్రాంత ప్రొఫెసర్ కుమారుడు శ్రీనివాస్ కూడా రామకృష్ణ బాధితుడే. ఆయన తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తన ఇంటిని హామీగా పెట్టి రామకృష్ణ నుంచి రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. శ్రీనివాస్ కుటుంబానికి లాసన్స్‌బే కాలనీలోని ఓ ఫ్లాట్ ఉంది. దానిపై రామకృష్ణ కన్నేశాడు
రామకృష్ణ ఆ ఇంటిని రూ.40 లక్షలకు కొనుగోలు చేస్తానని చెప్పడంతోపాటు అప్పుగా ఇచ్చిన రూ.5 లక్షలను అడ్వాన్సు కింద చెల్లించినట్టు మిగిలిన మొత్తం రిజిస్ర్టేషన్ రోజు ఇచ్చేలా అగ్రిమెంట్ చేసుకొన్నాడు. ఆ తర్వాత ఫ్లాట్‌ను ఆక్రమించుకున్నాడు. మిగిలిన డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

మరో కాల్ నాగు అరెస్టు
విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్‌లో చిరు వ్యాపారులు, నగరపాలక సంస్థ ఉద్యోగులకు అధిక వడ్డీతో రుణాలు ఇచ్చే కాల్ మనీ వ్యాపారి రాంపిల్ల పాపారావు (56)ను పోలీసులు గురువారం అరెస్టు చేసారు. పాపారావు వన్‌టౌన్ కాళేశ్వర మార్కెట్‌లో అల్లం, వెల్లుల్లి వ్యాపారం చేస్తుంటాడు. అతను నగర పాలక సంస్థ కార్యాలయంలో దిగువ స్థాయి ఉద్యోగులకు అధిక వడ్డీకి అప్పులు ఇస్తాడు.

ప్రతినెలా వేతనం రాగానే అప్పు తీసుకున్న వారి ఎంటిఎం సాయంతో నగదు తీసుకుని డబ్బులు మిగిలితే వారికి ఇస్తుంటాడు. కొంత మంది అప్పు తిరిగి చెల్లించినా వారి ప్రామిసరీ నోట్లు, ఇతర పత్రాలను ఇవ్వకుండా న్యాయవాది ద్వారా నోటీసులు పంపించి భయబ్రాంతులకు గురి చేస్తుండేవాడు.
రాజరాజేశ్వరిపేటకు చెందిన జగన్నాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి 452 ప్రామిసరీ నోట్లు, 330 ఖాళీ చెక్కులు, 154 పాస్ పుస్తకాలు, 158 ఎంటిఎం కార్డులు, 19 స్టాంపు పేపర్లు, రూ.1.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications