జగన్ బెయిల్ రద్దు కేసుపై నేడు సీబీఐ కోర్టు విచారణ-రఘురామ రీజాయిండర్ పై వాదనలు
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెయిల్ రద్దు కోరుతూ రెబెల్ ఎంపీ రఘురాకృష్ణంరాజు హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ మరోసారి విచారణకు రాబోతోంది. వైఎస్ జగన్ భవిష్యత్తుకు కీలకంగా మారిన ఈ పిటిషన్ పై విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేందుకు సీబీఐ కోర్టు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఘురామ పిటిషన్ పై జగన్ దాఖలు చేసిన కౌంటర్ కు తిరిగి రఘురామ రీజాయిండర్ ఇచ్చారు. దీనిపై ఇవాళ విచారణ జరగబోతోంది.
తాజాగా సీబీఐ కోర్టుకు సమర్పించిన రీజాయిండర్ లో రఘురామకృష్ణంరాజు.. జగన్ కు బెయిల్ ఇచ్చాక చోటు చేసుకున్న పలు పరిణామాలను ప్రస్తావించారు. అందులోనూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ తీసుకున్న పలు నిర్ణయాలను రఘురామరాజు తన రీజాయిండర్ లో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందులో తనపై సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న వారికి జరిగిన ప్రయోజనాలు, అలాగే మీడియాతో పాటు ప్రత్యర్ధుల్ని జగన్ టార్గెట్ చేస్తున్న విధానం, జారీ చేసిన జీవోలు... ఇలా పలు అంశాల్ని ప్రస్తావించారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది.

అలాగే రఘురామరాజు తనపై కేసులు దాచిపెట్టి నాపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఇచ్చిన కౌంటర్ పైనా రీజాయిండర్ లో సమాధానం ఇచ్చారు. తనపై దాఖలైన కేసులకూ జగన్ బెయిల్ రద్దుకూ సంబంధం లేదంటూ రఘురామ కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో తనపై దాఖలైన కేసులన్నీ ఎఫ్ ఐఆర్ దశలోనే ఉన్నాయని, తాను దోషిగా ఎక్కడా నిరూపణ కాలేదని రఘురామ పేర్కొన్నారు. దీంతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై రఘురామ దాఖలు చేసిన రీజాయిండర్ పై స్పందించేందుకు తమకు అదనపు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టును కోరారు. దీంతో గత విచారణ ఇవాళ్టికి వాయిదా పడింది. ఇవాళ మరోసారి సీబీఐ కోర్టు విచారణ జరపబోతోంది.












Click it and Unblock the Notifications