కోర్టులపై వ్యాఖ్యల కేసు-ఆమంచిని వదలని సీబీఐ-మరోసారి విచారణకు నోటీసులు
ఏపీలో వైసీపీ వ్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్ని విమర్శిస్తూ పలువురు అధికార పార్టీ నేతలు విమర్శలు చేశారు. వీరిలో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, మరికొందరు ఏకంగా బహిరంగంగానే కోర్టులపై నిప్పులు చెరిగారు. దీంతో వీటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ విచారణ మొదలుపెట్టింది.
ఏపీ హైకోర్టు జడ్డీలు, వారి తీర్పులపై గతంలో బహిరంగంగానే వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రకాశం జిల్లా చీరాల వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విశాఖలో సీబీఐ విచారణకు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారుయ అయితే ఆయనకు సీబీఐ మరోసారి ఇవాళ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 41ఏ కింద మరోసారి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే గతంలోనే సెక్షన్ 41ఏ నోటీసులు జారీ చేసిన సీబీఐ విచారణ జరిపింది. అయితే మరోసారి అదే నోటీసు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

న్యాయవ్యవస్ధపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రేపు సీబీఐ విచారణకు హాజరు కావాలని ఆమంచి కృష్ణమోహన్ కు నోటీసులు పంపారు. దీంతో ఆయన మరోసారి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసును హైకోర్టు కూడా సీరియస్ గా తీసుకోవడంతో సీబీఐ కూడా నిందితుల్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ మేరకు రేపు విచారణ పూర్తి చేసి హైకోర్టుకు నీవేదిక ఇచ్చేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో మిగతా నిందితులపై ఇప్పటికే పలుమార్లు హైకోర్టుకు సీబీఐ నివేదికలు అందజేసింది.