శ్రీవారి సేవలు రద్దు: ఆ మూడు రోజులూ
తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 77,077 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,241 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది.
పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈ నెల 25 నుండి 27 తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో ఒక్కో రోజు ఒక్కో వాహనసేవ ఉంటుంది.

తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో ఆకాశరాజు పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడికి కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది. నాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.












Click it and Unblock the Notifications