ఏపీలో అక్కడ ఇంటర్ తో పాటు నీట్, ఐఐటీ-జేఈఈ కోచింగ్ ఫ్రీ, హాస్టల్, భోజనం కూడా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందరికీ అందించటానికి విశేషంగా కృషి చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటంతో పాటు, ఉన్నత విద్యలో ఏఐ కోర్సును ప్రవేశపెట్టి ఏఐ విప్లవం తీసుకువచ్చింది. తల్లికి వందనం పథకం ద్వారా ఏపీలో పిల్లల చదువుకు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులకు భరోసా ఇస్తుంది. ఈ క్రమంలోనే గిరిజనులకు నాణ్యమైన విద్య కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
గిరిజన విద్యార్థుల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
ఇప్పటికే ఏపీలో గిరిజన విద్యార్థుల విద్యా అభివృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా కొత్త కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. విశాఖపట్నం జిల్లా మారికవలసలోని గురుకుల రెసిడెన్షియల్ స్కూల్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభం కానున్నాయి. గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ కమిషనర్ గౌతమి ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇంటర్మీడియట్ విద్యతో పాటు నీట్, ఐఐటీ-జేఈఈ పరీక్షలకు ఉచితంగా కోచింగ్
ఈ కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యతో పాటు నీట్, ఐఐటీ-జేఈఈ పరీక్షలకు ఉచితంగా సమగ్ర రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తారు. పదో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా ఈ ఏడాది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కు కలిపి 600 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీరిలో 50 శాతం బాలికలు ఉన్నారు. మొత్తం 300 మంది అబ్బాయిలు, 300 మంది అమ్మాయిలు ఇందులో చదువుకోనున్నారు.
ఇంటర్ తో పాటు ఉచిత వసతి, భోజనం , మరియు కోచింగ్
ఎంపీసీ గ్రూప్‌లో ఫస్ట్ ఇయర్‌కు బాలురు 75, బాలికలు 75 మంది; సెకండ్ ఇయర్‌కు కూడా అదే సంఖ్యలో అడ్మిషన్లు ఉన్నాయి. బైపీసీ గ్రూప్‌లోనూ ఇదే తరహాలో సీట్లు కేటాయించారు. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయి. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం అందిస్తారు. ప్రభుత్వం ఈ కేంద్రానికి అవసరమైన వసతులు, ఫర్నీచర్, ఐసీటీ సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా పనులు పూర్తి చేశారు.
ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
మారికవలసలోని ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఎక్స్‌లెన్స్ సెంటర్‌గా మార్చడంతో అక్కడ చదువుతున్న విద్యార్థులను 226 మందిని మారికవలస గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు, 9, 10 తరగతుల 208 మందిని పార్వతీపురం జోగింపేట గురుకులానికి, మిగిలిన 56 మందిని సమీప గురుకులాలకు తరలించారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం ద్వారా గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications