అల్లు అర్జున్ టూర్ ఎఫెక్ట్: నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం
అమరావతి: ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ పర్యటన నేపథ్యంలో నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతోపాటు ఎస్ డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం.
కాగా, ఇటీవల నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి అల్లు అర్జున్ వెళ్లారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా నంద్యాల పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఉండగా ఇంచుమించు అదే సమయంలో అల్లు అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం నంద్యాల ఎస్పీపై చర్యలకు ఆదేశించింది.
అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ శనివారం ఉదయం నంద్యాలలో పర్యటించిన విషయం తెలిసిందే. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్ గత పదిహేనేళ్లుగా స్నేహితులు. ఈ క్రమంలోనే తన మిత్రుడు శిల్పా రవి కోసం అల్లు అర్జున్ సతీసమేతంగా నంద్యాలలో అడుగుపెట్టారు.
శిల్పా రవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిలపై కేసు నమోదైంది. తమ అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేశారంటూ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications