రాజశ్యామల యాగంతోనే ఏపీకి కేంద్రం నిధులు-మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతోంది. అంతకు ముందు టీడీపీ కూడా దాదాపు మూడున్నరేళ్ల పాటు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ లో భాగస్వామిగా ఉంది. అలాగే రాష్ట్రంలోనూ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా అవకాశం కల్పించింది. అయినా కేంద్రం విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన రెవెన్యూ లోటుతో పాటు ఇతర నిధుల్ని ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చింది. కానీ తాజాగా రూ.10 వేల కోట్ల మేర రెవెన్యూ లోటు నిధుల్ని విడుదల చేసింది. దీనికి కారణమేంటో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇవాళ వెల్లడించారు.
ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజశ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయని, రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని కొట్టు వెల్లడించారు. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు మంత్రి తెలిపారు. కార్తీక మాసం లో నిర్వహించాలని సూచనలు వచ్చాయని, ఆలయాల ఆస్తుల అక్రమణ, లీజు గడువు ముగిసినా అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీల్లేకుండా చట్ట సవరణ చేశామన్నారు. మరోవైపు తిరుపతి హథీరాం జీ మఠానికి మహంతుగా ఉన్న అర్జున్ దాస్ అనే వ్యక్తి అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కోట్లాది రూపాయల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారని మంత్రి ఆరోపించారు.
ప్రభుత్వానికి హథీరాంజీ మఠంపై ఎలాంటి హక్కులు లేకుండా అర్జున్ దాస్ కోర్టుకెళ్లారని దేవాదాయమంత్రి తెలిపారు. హథీరాం జీ మఠం ఆస్తుల్ని లీజులకు ఇస్తు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తేలిందన్నారు. సన్యాసిగా ఉండాల్సిన మహంత్ అర్జున్ దాస్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారన్నారు. దీనిపై కమిటీని వేసి చర్యలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.
అందుకే ధార్మిక పరిషత్ ద్వారా స్వామీ హథీరాం జీ మఠం మహంత్ గా ఉన్న అర్జున్ దాస్ ను సస్పెండ్ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామన్నారు. హథీరామ్ జీ మఠానికి మరోకరిని బాధ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.












Click it and Unblock the Notifications