రాధాకు చంద్రబాబు ఫోన్ - ఆ నిర్ణయం సరికాదంటూ : డీజీపీకి లేఖ- ప్రభుత్వానిదే బాధ్యత..!!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వంగవీటి రాధా హాట్ టాపిక్ గా మారారు. తనను పొట్టన పెట్టుకొనేందుకు రెక్కీ నిర్వహించారంటూ రాధా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. మంత్రి కొడాలి నాని.. ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే రాధా ఈ వ్యాఖ్యలు చేసారు. దీంతో...సీఎంను కలిసిన కొడాలి నాని ఈ విషయాన్ని వివరించారు. వెంటనే సీఎం జగన్ పోలీసు ఉన్నతాధికారులకు దీని పైన విచారణ చేయాలని ఆదేశించటంతో పాటుగా టూ ప్లస్ టూ గన్ మెన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాధా వ్యాఖ్యలతో కలకలం
వెంటనే పోలీసు శాఖ గన్ మెన్లను కేటాయించింది. అయితే ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని, తనకు గన్‌మెన్లు వద్దన్నారు. అభిమానులు, అనుచరులే తనకు రక్షణ అంటూ చెప్పుకొచ్చారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్ చేసి అడిగారన్నారు రాధా. పోలీసులు సంప్రదిస్తే పూర్తి వివరాలిస్తానని చెప్పారు. ఇక, ఇప్పుడు తాజాగా వంగవీటి రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసారు. రాధా వ్యాఖ్యల పైన ఆరా తీసారు. గన్ మెన్లను తిరస్కరించటం సరి కాదని చంద్రబాబు సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని చెప్పారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచన చేసారు.

చంద్రబాబ పోన్.. తిరస్కరించవద్దని సూచన
రాధాకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కుట్ర రాజకీయాలపై పార్టీ పరంగా పోరాడదామంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు లేఖ రాసారు. రాధకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని, హింసాత్మక ఘటనలపై చర్యలు లేకే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ చేయాలని కోరారు.

డీజీపీకి లేఖ.. బెదిరింపుల్లో భాగమంటూ
బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లోనే చంద్రబాబు..వంగవీటి రాధాతో సమావేశం అయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. బెజవాడ కేంద్రంగా ఇప్పుడు రాధా చుట్టూ రాజకీయం తిరుగుతోంది. వైసీపీలోకి తీసుకొచ్చే క్రమంలో ఆ పార్టీ కీలక నేతలు.. టీడీపీ నుంచి జారిపోకుండా చూసుకొనేందుకు ఆ పార్టీ అధినేత అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు సైతం రాధా వ్యాఖ్యలు..రెక్కీ అంశం పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications