వైసీపీలా కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఎమ్మెల్యేలకు చెప్పిన చంద్రబాబు...!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలను మీరు పునరావృతం చేయొద్దంటూ సీఎం చంద్రబాబు ఇవాళ ఎన్డీఏ ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఇందులో ప్రధానంగా అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన, బడ్జెట్ పై అవగాహన తెచ్చుకోవడం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.
ఇందులో గత ఐదేళ్ల కాలంలో అసెంబ్లీలో దూషణలకు దిగడం ద్వారా వైసీపీ ఎమ్మెల్యేలు ఎలా పలుచన అయ్యారో చంద్రబాబు ఎమ్మెల్యేలకు వివరించారు. ముఖ్యంగా అసెంబ్లీలో తమ ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతున్నారనే దానిపై ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉంటారన్నారు. అందులో బూతులు మాట్లాడితే మాత్రం ప్రజలు స్వాగతించరని గుర్తుచేశారు. గతంలో ఇదే జరిగిందంటూ గత ఎన్నికల్లో వైసీపీ ఓటమిని పరోక్షంగా ప్రస్తావించారు.

అలాగే శాసనసభలో ప్రతిపక్షం లేదు కదా, మనకేం ఫర్వాలేదని అనుకోవద్దని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు మరో కీలక సూచన చేశారు. వాళ్లకు ఎలాగో బాధ్యత లేదని, కానీ మనం మాత్రం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేద్దామని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. ప్రజలకు ఏం అవసరమో చెప్పడానికి, అలాగే మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఓ వేదిక లాంటిదని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. బడ్జెట్ తో పాటు ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ఎమ్మెల్యేలు తప్పకుండా అధ్యయనం చేయాలని సూచించారు.












Click it and Unblock the Notifications