వైసీపీతో అలర్ట్..! నేతలతో బాబు వ్యాఖ్యలు-పదవులపై క్లారిటీ..!
ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం, ఆ తర్వాత జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయాలు, టీడీపీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలు, అమరావతిలో వరదలపై ప్రచారం వంటి అంశాలపై ఇవాళ పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో చర్చించారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లు, జోనల్ కో-ఆర్డినేటర్లు, గ్రామ, మండల స్థాయి కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహణ, పార్టీ కమిటీల నియామకం అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం, ప్రజలకు వివరించేందుకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతం అయ్యిందని ప్రకటించారు. టెక్నాలజీ సాయంతో రాష్ట్రంలో 1.24 కోట్ల కుటుంబాలను నేరుగా కలిశామని, ప్రజాప్రతినిధులు ఎవరెవరిని కలిశారో యాప్ లో తెలుసుకున్నామని వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమైందన్నారు.

ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నాం కాబట్టే ఈ స్థాయి సంతృప్తి వ్యక్తం అయ్యిందన్నారు.
పింఛన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి- ఉచిత బస్సు ప్రయాణ పథకాలను చెప్పిన విధంగా అమలు చేశామని, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. దీని కోసం నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండాలన్నారు.
పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్‌లకు ఛైర్మన్‌లను నియమించామని, ఇతర పదవుల భర్తీ కూడా చేపడతామన్నారు. రాష్ట్రంలో ఓ నేర చరిత్ర కలిగిన పార్టీ ఉంది. వాళ్ల పని నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే అన్నారు. సోషల్ మీడియా, సొంత టీవీ, పత్రికల్లో, అనుబంధ మీడియాతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయని, ఊళ్లు మునుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నాయకులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మంత్రులు, పార్టీ నేతలు ఈ విషయంలో మరింత చొరవ చూపాలన్నారు. లేకపోతే ప్రజలు ఆ తప్పుడు ప్రచారాలనే నిజం అని నమ్మే స్థాయికి తీసుకువెళ్తారన్నారు. తమపై చేసే అసత్య ప్రచారాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంఛార్జ్‌లు, కార్యకర్తలు మరింత క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు మరింత బాధ్యతగా ఉండాలని, మీ మాట, మీ చర్య పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండకూడదు. వివాదాలకు ఏ ఒక్కరూ ఆస్కారం ఇవ్వకూడదని సూచించారు.

రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కఠినంగా ఉంటామని హెచ్చరించారు. పార్టీ కమిటీలను సాధ్యమైనంతవరకు ఈ నెల చివరికి పూర్తి చేయాలని, దీనికి సంబంధించి పనిని వేగవతం చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లతో ముఖాముఖి అవుతున్నట్లు తెలిపారు. మంచి చెడులు వారితో చర్చిస్తున్నానన్నారు. పొరపాట్లు ఉంటే సరిదిద్దుతూ సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలను తీర్చేలా నేతల, ప్రభుత్వ పనితీరు ఉండాలన్నారు. దీన్ని మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు.
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలను చంద్రబాబు అభినందించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించి కాలర్ ఎగరేసి తిరిగేలా, గర్వపడేలా అంతా పని చేశారన్నారు. వివేకానందరెడ్డికి న్యాయం చేయండి, 30 ఏళ్ల తర్వాత ఓటు వేసే అవకాశం కల్పించినందుకు దండాలు అని బ్యాలెట్ బాక్సులో రాసి వేశారని, ఇది పులివెందులలో పరిస్థితి అద్దం పడుతోందన్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకు చట్టబద్దంగా వ్యవస్థలు పనిచేశాయి కాబట్టే అంత మంది పోటీ చేశారని, అంత మంది స్వేచ్ఛగా ఓట్లువేశారన్నారు. కానీ ఇప్పుడు ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా కూటమి అభ్యర్థులు గెలవాలన్నారు.












Click it and Unblock the Notifications