Chandrababu ఆ ప్రకటనతో అమరావతి, విజయవాడలో రియల్ ఎస్టేట్ దూకుడు!!
2019 అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి విజయం సాధించిన తర్వాత నాడు ఏపీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోను, గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలోనూ భూముల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి.
జగన్ దెబ్బకు అమరావతి, విజయవాడ, గుంటూరులలో పడకేసిన రియల్ ఎస్టేట్
భూములు మాత్రమే కాదు రాజధాని అమరావతిలో నిర్మించిన అపార్ట్మెంట్లు, రాజధానికి దగ్గరగా ఉండటంలో విజయవాడ, గుంటూరు కేంద్రంగా నిర్మితమైన అపార్ట్మెంట్లలోనూ ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు లేక చాలామంది బిల్డర్లు, నష్టాల దెబ్బకు రియల్టర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎంతోమంది తీవ్ర నష్టాలపాలై పడరాని పాట్లు పడ్డారు. ఐదేళ్లపాటు అమరావతి విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడకేసింది.

చంద్రబాబు రాక అమరావతి రియల్ ఎస్టేట్ కు బూస్ట్
ఇక తాజాగా మళ్లీ 2024 ఎన్నికలలో టిడిపి కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు సీఎంగా మళ్లీ పగ్గాలు చేపట్టడంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త జవసత్వాలు వచ్చినట్లు అయింది. రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని అమరావతిని ప్రపంచం గుర్తించేవిధంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన రాజధాని అమరావతిలో నిర్మాణాలు చేసిన వారికి, భూముల కొనుగోలు, అమ్మకాలు లావాదేవీలు చేసే వారికి ఓ గొప్ప బూస్ట్ ను ఇచ్చింది.
అమరావతి బాగా డెవలప్ అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు సవాలే
రాజధాని నగరం అమరావతిపై చంద్రబాబు మళ్ళీ దృష్టి సారించడంతో అమరావతిపై పెట్టుబడిదారుల ఫోకస్ పెరుగుతుందని ఫలితంగా అమరావతిలో భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతిలో అభివృద్ధి జరిగి మహానగరంగా రూపుదిద్దుకుంటే అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు సవాల్ విసురుతుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ రీసెర్చ్ లో తేలింది.
చంద్రబాబు రాకతో పుంజుకుంటున్న ధరలు
చంద్రబాబు ప్రకటన తర్వాత అప్పటినుంచి ఇప్పటికే అమరావతి రూపురేఖలలో మార్పులు రాగా, గత ఐదేళ్లలో తీవ్ర విధ్వంసానికి గురైన అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కంకణ బద్ధుడై పని చేస్తానని చెప్పిన క్రమంలో కొద్దికొద్దిగా మళ్లీ అమరావతిలో భూముల ధరలు పుంజుకునే అవకాశం ఉందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.
జగన్ పాలనలో పాతాళంలో ధరలు.. చంద్రబాబు పాలనతో ధరలకు మళ్ళీ కొత్త రెక్కలు
జగన్ మూడు రాజధానుల ప్రకటన చేస్తున్న తర్వాత ఊహించని విధంగా భూముల ధరలు 60 శాతానికి పైగా తగ్గాయి. గతంలో టీడీపీ పాలనలో రెండున్నర కోట్లుగా ఉన్న ఎకరం ధర వైసీపీ పాలనలో కోటి రూపాయలకు పడిపోయింది. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ భూముల ధరలకు కొత్త రెక్కలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications