నంద్యాల దాడులపై చంద్రబాబు సీరియస్- విచారణకు కమిటీ ఏర్పాటు
ఏపీలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో నంద్యాలలో భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే నంద్యాలలో నేతలు పార్టీ పరువును బజారున పడేసినట్లు చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో ఘర్షణలపై విచారణ కోసం టీడీపీ తరఫున ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు.
నంద్యాలలో నిన్న రాత్రి భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలకు అసలు కారణాలు, క్షేత్రస్దాయిలో పరిస్ధితులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముగ్గురు సభ్యుల కమిటీలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. అసలు నంద్యాలలో గొడవకు కారణం ఎవరు, లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇరువర్గాలు పరస్పరం బహిరంగ దాడులకు దారి తీసిన కారణాలేంటన్న దానిపై ఈ కమిటీ విచారణ జరపనుంది.

మరోవైపు నంద్యాలలో లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు విడివిడిగా చేసిన అఖిలప్రియ, సుబ్బారెడ్డి వర్గాలు.. ఆ తర్వాత ఆధిపత్యం ప్రదర్శించేందుకు బాహాబాహీకి దిగాయి. ముందుగా అఖిల వర్గీయులే సుబ్బారెడ్డి మొహంపై దాడి చేశారని, ఆ తర్వాత సుబ్బారెడ్డి అనుచరులు ప్రతిదాడులకు దిగినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణల తర్వాత పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరిపైనా కేసులు నమోదు చేశారు.

నంద్యాలలో నిన్న జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సుబ్బారెడ్డి.. అఖిల ప్రియపై హత్యాయత్నం కేసు పెట్టారు. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్ కు రప్పించారు. స్టేషన్ కు వచ్చిన అఖిల.. సుబ్బారెడ్డి తన చున్నీ లాగారంటూ మరో కేసు పెట్టారు. దీంతో సుబ్బారెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. వీటిపై క్షేత్రస్ధాయిలో విచారణ తర్వాత పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అదే సమయంలో టీడీపీ కూడా ఈ ఘటనలపై ఆగ్రహంగా ఉంది.












Click it and Unblock the Notifications