ఆ హీరో అంటే పిచ్చి.. సినిమా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తా - నాగదుర్గ
నాగదుర్గ.. తెలుగు రాష్ట్రాల్ని ప్రజలకు సుపరిచితురాలే. యూట్యూబ్‌లో జానపద గీతాలు, డ్యాన్స్‌లతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ తెలంగాణ అమ్మాయి. "దారిపొంటత్తుండు", "నా పేరు ఎల్లమ్మ", "ఎర్ర రుమాల్", "కాపోళ ఇంటికాడ" వంటి ఫోక్ సాంగ్స్‌తో కోట్లాది వ్యూస్ సాధించింది. ఇప్పటికే ఫోక్ సింగర్‌గా, డాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా హీరోయిన్‌గా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్, కోలీవుడ్ లలో దూసుకుపోతుంది. అయితే తనకు ఫేమ్ తీసుకొచ్చిన యూట్యూబ్ ని మాత్రం మర్చిపోకుండా మళ్లీ కొత్త పాటతో ట్రెండింగ్ గా నిలిచింది.
ఇక యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన నాగదుర్గ ఇప్పుడు అదే క్రేజ్‌ను సినిమాల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగులో 'కలివనం' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నాగదుర్గ.. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అదే సమయంలో తమిళ చిత్రసీమలో కూడా అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తున్న 'లవ్ ఓ లవ్' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అయితే ఆమె కెరీర్‌లో అసలైన బ్రేక్ ఇచ్చే సినిమా మాత్రం ఇప్పుడు ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న 'ఇడుపు కాయితం'అనే భావిస్తున్నారు.

'బలగం' ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నాగదుర్గ హీరోయిన్‌గా ఎంపికైంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో దొండపాటి వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో నాగదుర్గ 'శ్రీలత' అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో ఆమె లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'ఇడుపు కాయితం' అనే విభిన్నమైన టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. కాగా ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగదుర్గ చేసిన పలు కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఆమె ఏమన్నారంటే..
ప్రస్తుతం సినిమాలలో కథానాయికలకు సమాన ప్రాధాన్యత చాలా తక్కువగా లభిస్తోందని.. ఎక్కువ సినిమాలు హీరో డామినేషన్ తోనే వస్తున్నాయని నాగదుర్గ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అభిమాన హీరో ప్రభాస్ అని.. ఆయనతో సినిమా ఆఫర్ వస్తే ఆనందంతో ఎగిరి గంతేస్తానని వెల్లడించారు. ఇది చాలామందికి తెలిసిన విషయమేనని నవ్వుతూ చెప్పారు. సినిమాల్లో ఈ అమ్మాయి బాగుంది, బాగా చేసింది అనే పేరు కంటే, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, గ్రేట్ పర్ఫార్మెన్స్ అనిపించుకోవాలని ఉందన్నారు. కేవలం 50-100 సినిమాలు కాకుండా, 10 సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలని, వివిధ జానర్లలో నటించాలని తన కోరిక అని తెలిపారు. తనకు బాగా నచ్చిన హీరోయిన్స్ స్నేహ, సాయి పల్లవి అని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications