చెన్నై సూపర్ కింగ్స్ కు గుడ్ బై: తెగిన 18 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఓ ప్రయాణానికి తెరపడింది. చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకొన్నారు. గత 18 సంవత్సరాలుగా ఫ్రాంచైజీతో కొనసాగుతున్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకున్నాడు. ఫ్రాంఛైజీ యాజమాన్యంతో పరస్పర అంగీకారానికి వచ్చిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యం కొద్దిసేపటి కిందటే అధికారికంగా ప్రకటించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఓ కోచ్, టీమ్ మధ్య ఇంత బలమైన బంధం కొనసాగడం ఇదే మొదటిసారి కూడా. ఏ కోచ్ కూడా ఇన్ని సంవత్సరాల పాటు ఒకే ఫ్రాంఛైజీలో నిలకడగా లేడు.
స్టీఫెన్ ఫ్లెమింగ్, మేనేజ్‌మెంట్ మధ్య జరిగిన పలు విడతల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ తెలిపింది. అత్యంత గౌరవప్రదమైన వాతావరణంలో, ఇరుపక్షాల సమ్మతితోనే ఈ వీడ్కోలు పలకాల్సి వచ్చిందని సీఎస్‌కే స్పష్టం చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు జట్టును అగ్రపథంలో నిలిపినందుకు ఫ్లెమింగ్‌కు యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఆయన చూపిన చొరవ అద్భుతమని కొనియాడింది.

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్థానం సీఎస్‌కేతో ఓ కోచ్‌గానే ప్రారంభం కాలేదు. 2008లో జరిగిన ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ఆయన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆటగాడిగా బరిలోకి దిగారు. ఆ ఏడాది సీఎస్‌కే జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాతి ఏడాదే, అంటే 2009 సీజన్‌కు ముందు ఫ్లెమింగ్‌ను సీఎస్‌కే యాజమాన్యం హెడ్ కోచ్‌గా నియమించింది. ఆ నిర్ణయమే ఐపీఎల్ చరిత్రను మార్చేసే అత్యంత విజయవంతమైన భాగస్వామ్యానికి పునాది వేసింది.
కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనీతో కలిసి అద్భుతమైన సమన్వయంతో జట్టును నడిపించారు. ఆయన పర్యవేక్షణలో సీఎస్‌కే సాధించిన విజయాలు అసాధారణమైనవి. ఐపీఎల్ చరిత్రలో చెన్నై జట్టును అయిదు సార్లు 2010, 2011, 2018, 2021, 2023 ఛాంపియన్‌గా నిలబెట్టడంలో ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించారు. దీనితో పాటు రెండు సార్లు ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ లీగ్ టీ20 టైటిళ్లను కూడా జట్టు ఖాతాలో వేశారు. ఐపీఎల్‌లోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ కోచ్‌గా ఫ్లెమింగ్ చరిత్ర సృష్టించారు.
OFFICIAL ANNOUNCEMENT
— Chennai Super Kings (@ChennaiIPL) July 13, 2026
The Super Kings and Head Coach Stephen Fleming have mutually decided to part ways.
Together, we shared one of the most successful and enduring partnerships in IPL history. The legacy you've built will continue to inspire us.
With immense respect and… pic.twitter.com/qjvb4oZUuU
ప్రశాంతంగా ఉంటూ, తెరవెనుక వ్యూహాలను రచించడంలో ఫ్లెమింగ్ సిద్ధహస్తుడు. ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించి, వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీయడంలో దిట్ట. ఎంఎస్ ధోనీ వ్యూహాత్మక ఆలోచనలకు ఫ్లెమింగ్ నిర్దేశకత్వం తోడవ్వడంతో సీఎస్‌కే డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ ఒత్తిడి లేని వాతావరణం ఉండేది. కఠిన పరిస్థితుల్లో సైతం జట్టును స్థిరంగా ఉంచడం ఫ్లెమింగ్ కోచింగ్ లోని అతిపెద్ద ప్రత్యేకతగా నిలిచింది.
ఫ్లెమింగ్ నిష్క్రమణతో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందే నూతన హెడ్ కోచ్‌ను ఎంపిక చేయడం యాజమాన్యానికి పెద్ద టాస్క్ కానుంది. ఇంతకాలం జట్టుకు పట్టుకొమ్మలా నిలిచిన ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడైన వ్యూహకర్త కోసం అన్వేషణ ప్రారంభమైంది. ధోనీ, మేనేజ్‌మెంట్‌తో సులభంగా ఒదిగిపోయే వ్యక్తిని ఎంపిక చేయడం ఫ్రాంఛైజీ ముందున్న ప్రధాన లక్ష్యం.












Click it and Unblock the Notifications