పంతం నెగ్గించుకున్న చంద్రబాబు - పుంగనూరులో అడుగుపెట్టని పెద్దిరెడ్డి..!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ తర్వాత నంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరును కంచుకోటగా మార్చుకున్నారు. ఐదేళ్లుగా తన నియోజకవర్గంలోకి కాదు చుట్టు పక్కలకు కూడా టీడీపీ నాయకుల్ని రాకుండా దాడులతో అడ్డుకున్న పెద్దిరెడ్డి.. ఇవాళ తొలిసారి అదే టీడీపీ నేతలకు భయపడి పుంగనూరుకు రాకుండా దూరంగా ఉండిపోయారు.
గతంలో పుంగనూరుతో సహా చిత్తూరు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజా ఎన్నికల్లో అతి కష్టం మీద గెలిచి బయటపడ్డారు. ఫలితాల తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన పెద్దిరెడ్డి.. ఇవాళ తన సొంత నియోజకవర్గం పుంగనూరుకు తిరిగి వచ్చేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులు పుంగనూరులో నిరసనకు దిగారు. పెద్దిరెడ్డి పుంగనూరుకు రాకూడదంటూ నిరసనలు చేపట్టారు.

గతంలో చంద్రబాబును తన నియోజకవర్గం కుప్పంలో అడుగుపెట్టకుండా అడ్డంకులు సృష్టించిన పెద్దిరెడ్డిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు అడ్డుకునేందుకు ప్లాన్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. చివరికి పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం పుంగనూరు పర్యటనను రద్దు చేసుకుని దూరంగా ఉండిపోయారు. దశాబ్దాలుగా పుంగనూరులో పాగా వేసిన పెద్దిరెడ్డి గత ఐదేళ్ల కాలంలో టీడీపీని తీవ్రంగా టార్గెట్ చేశారు. దీంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ శ్రేణులు పుంగనూరులో మోహరించడంతో చేసేది లేక పెద్దిరెడ్డి వెనక్కి తగ్గారు.












Click it and Unblock the Notifications